
శ్రీలీల తెలుగు సినిమా పరిశ్రమలో తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. 2001 జూన్ 14న, USAలోని మిచిగాన్ రాష్ట్రం, డెట్రాయిట్ లో జన్మించిన ఈమె బెంగళూరులో పెరిగింది. ఆమె తల్లి స్వర్ణలత గైనకాలజిస్ట్, తండ్రి పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు. చిన్నతనం నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందిన శ్రీలీల, 2022లో MBBS పూర్తి చేసింది.
2017లో “చిత్రాంగద” సినిమాతో చిన్నపాత్రలో నటించిన శ్రీలీల, 2019లో “కిస్” అనే కన్నడ చిత్రంతో కథానాయికగా మారింది. 2021లో “పెళ్లి సందడి” ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. “ధమాకా” లో నటించి భారీ విజయాన్ని అందుకున్న శ్రీలీల, SIIMA అవార్డు గెలుచుకుంది.
2023లో వరుసగా “భగవంత్ కేసరి”, “స్కంద”, “ఆదికేశవ”, “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలు చేసింది. కానీ “భగవంత్ కేసరి” తప్ప ఇతర చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. 2024లో “గుంటూరు కారం” లో నటించినా, సినిమా ఫలితం నిరాశ పరిచింది. అయితే, “Pushpa 2” లో స్పెషల్ సాంగ్ చేసి మళ్లీ ట్రెండ్ లోకి వచ్చింది.
ప్రస్తుతం నితిన్ సరసన “రాబిన్ హుడ్”, రవితేజతో “మాస్ జాతర”, పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్”, శివ కార్తికేయన్ తో “పరాశక్తి” చిత్రాల్లో నటిస్తోంది. అదనంగా, బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. శ్రీలీల కెరీర్ మరింత ముందుకెళ్లనున్నదనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.