
ప్రముఖ నటి జ్యోతిక బాలీవుడ్‌లో తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 1998లో హిందీలో తన మొదటి చిత్రం చేసిన ఈ నటి దాదాపు 25 ఏళ్ల విరామం తర్వాత బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది.
అమె నటించిన “డబ్బా కార్టెల్” అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సిరీస్ డ్రగ్స్ అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందించబడింది. ఇందులో జ్యోతిక కొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక దక్షిణాది సినిమాల్లో హీరోల అధిక ప్రాధాన్యతపై వ్యాఖ్యానించింది. “సౌత్ ఇండస్ట్రీలో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. హీరోయిన్లను కేవలం డ్యాన్స్ చేయడానికి, హీరోలను పొగడడానికి మాత్రమే ఉపయోగిస్తారు” అని తెలిపింది.
“ఇటీవల కొన్ని మార్పులు కనిపిస్తున్నా, ఇప్పటికీ సినిమాల్లో హీరోల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. నేనూ గతంలో అలాంటి సినిమాల్లో నటించాను, కానీ ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను” అంటూ వెల్లడించింది.
సూర్యతో పెళ్లి తర్వాత సినీరంగానికి దూరమైన జ్యోతిక, కొన్ని హిట్ చిత్రాలతో తిరిగి కెరీర్‌ను గాడిలో పెట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మరిన్ని ప్రాజెక్ట్స్‌పై దృష్టిపెట్టినట్లు సమాచారం.