
జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. ఆయన మొత్తం 70 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు ప్రకటించారు. నాగబాబు తనపై ఏదైనా క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అయితే, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతుంటాయి. ముఖ్యంగా, చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల దగ్గర అప్పు తీసుకున్న విషయాన్ని అఫిడవిట్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
నాగబాబు చరాస్తులు 59 కోట్లు విలువైనవని వెల్లడించారు. ఇందులో మ్యూచువల్ ఫండ్స్ & బాండ్లు రూ.55.37 కోట్లు, బ్యాంక్ నిల్వలు రూ.23.53 లక్షలు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు ఉన్నాయి. బెంజ్ కారు రూ.67.28 లక్షలు, హ్యుందాయ్ కారు రూ.11.04 లక్షలు, బంగారం 724 గ్రాములు, వెండి 20 కేజీలు, వజ్రాలు 55 క్యారట్లు కలిపి రూ.57.99 లక్షల విలువ ఉందని పేర్కొన్నారు.
నాగబాబు స్థిరాస్తులు మొత్తం రూ.11.20 కోట్లు. హైదరాబాద్ మణికొండలో విల్లా రూ.2.88 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి రూ.5.3 కోట్లు, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి రూ.82.80 లక్షలు, టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి రూ.53.50 లక్షలు విలువైనట్లు తెలిపారు.
అఫిడవిట్ ప్రకారం, నాగబాబు చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు, పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ వివరాలు మెగా అభిమానులలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.