
ఆషికా రంగనాథ్ ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. కర్ణాటక తుమకూరు లో జన్మించిన ఆమె, చిన్నతనం నుండే నటనపై ఆసక్తిని కనబరిచింది. కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ షోలలో పాల్గొని, 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టి, రాంబో 2 మూవీతో మంచి హిట్ అందుకుంది.
తక్కువ సమయంలోనే మదగజ, అవతార పురుష, గరుడ వంటి హిట్ సినిమాలతో కన్నడలో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ లో కనిపించి, మరింత ప్రాచుర్యం పొందింది. తమిళ పరిశ్రమలోనూ అడుగుపెట్టిన ఆమె, తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
దీంతో తెలుగు ప్రేక్షకులకు ఆషికా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాతో మళ్లీ టాలీవుడ్లో ప్రయత్నించింది. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ను మెచ్చుకున్నారు.
అయినప్పటికీ, ఆషికాకు పెద్దగా తెలుగు ఆఫర్స్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికీ ఆమె బోలెడన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరో మంచి హిట్ వస్తే, టాలీవుడ్లో ఆమె స్టార్ హీరోయిన్గా మారే అవకాశముంది.