
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన చిన్నతనంలో ఎదుర్కొన్న కుటుంబ కష్టాలు, బాధ్యతలు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక ఇంటర్వ్యూలో చిరు తన చెల్లెలి మరణం గురించి ఎమోషనల్ అవుతూ, చిన్నతనంలో తల్లి బాధ్యతలు తనపై ఎలా వచ్చాయో చెప్పుకున్నారు. “మేము ఐదుగురం కుటుంబంలో ఉన్నా, చిన్న వయసులోనే మరో ముగ్గురు సోదరులు చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా బిజీగా ఉండేవారు. మా అమ్మ ఇంటి బాధ్యతలన్నీ చూసుకునే వారు. అందుకే నేను ఆమెకు సహాయం చేసేవాడిని” అని చిరు తెలిపారు.
తన ఆరో తరగతి చదువుతున్న సమయంలో రమ అనే చెల్లెలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. “నాన్నకు విషయం తెలియకుండానే అమ్మ, నేను కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాం. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో రెండు రోజుల్లోనే మృతిచెందింది. ఆమెను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చిన ఆ క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను” అంటూ చిరంజీవి ఆ క్షణాలు తనను ఎంతగా కలిచివేశాయో తెలిపారు.
తన తండ్రి ఇంటికి చేరుకునే సరికి అంతా ముగిసిపోయిందని చిరు ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల వాళ్లు సహాయం చేయడంతో చెల్లెలి అంత్యక్రియలు నిర్వహించగలిగామని పేర్కొన్నారు. చిన్న వయసులోనే తల్లి బాధ్యతలు తనపై పడ్డాయని, తల్లి తన ఒంటరి పోరాటాన్ని ఎలా కొనసాగించిందో గుర్తుచేసుకున్నారు.
ఈ సంఘటన తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని చిరు అన్నారు. చిన్నతనంలోనే బాధ్యతలేర్పడటంతో కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచన మరింత పెరిగింది. ఈ అనుభవాలే తన సినిమా రంగంలో ముందుకు వెళ్లే ప్రేరణగా మారాయి అని చిరంజీవి చెప్పారు.