
టాలీవుడ్ నటుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి పై నమోదైన కేసుల్లో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు మేరకు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. పోసాని తరఫున వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు వాదనలు వినిపించగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పీటీ వారెంట్ పై పోసానిని విజయవాడ కోర్టులో హాజరు పరచారు. ఇక పోసాని తనపై నమోదైన 16 కేసుల్లో 5 కేసుల్లో రిలీఫ్ పొందగా, మిగతా కేసులను హైకోర్టులో కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లలో పోసానిపై నమోదైన కేసులను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యాఖ్యలను రాజకీయంగా తప్పుగా అర్థం చేసుకున్నారని పోసాని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హైకోర్టులో తనపై నమోదైన మిగతా 11 కేసులకు ఊరట లభిస్తుందా? అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఈ కేసుల నేపథ్యంలో పోసాని రాజకీయంగా మరింత దూకుడు పెంచుతారా?, లేదా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారా? అనే దానిపై ఆసక్తికరంగా మారింది. టిడిపి, జనసేన వర్గాలు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి.