
ఆర్తి అగర్వాల్ టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన నటి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి అగ్రహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 16 ఏళ్ల వయసులో బాలీవుడ్లో “పాగల్పాన్” సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టి, “నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్రహీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అయితే, ఆమె వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండింది. 2005లో ఓ స్టార్ హీరోతో రిలేషన్లో ఉందంటూ వచ్చిన వార్తలు ఆమె మానసికంగా కుంగిపోయేలా చేశాయి. ఆ సమయంలో ఆమె క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకున్నారు, కానీ కొద్ది కాలంలో విడిపోయారు.
2015లో ఆమె లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ తర్వాత శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేరారు. జూన్ 6, 2015న, 31 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో మరణించారు. ఆమె మృతి టాలీవుడ్‌లోని అభిమానులను, సినీ పరిశ్రమను కలచివేసింది.
ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కూడా “గంగోత్రి” సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. అయితే, ఆర్తి అగర్వాల్ మాదిరి ఆమె కెరీర్ సక్సెస్ కాలేదు. టాలీవుడ్‌కు ఆమె అందించిన వినోదం చిరస్మరణీయమైనది. ఆమె ఆకస్మిక మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలింది.