సందీప్ కిషన్ నడుపుతోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ లో బుధవారం (జులై 10) న ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారని ఒక వార్త బాగా వైరలయ్యింది. అంతేకాదు అక్కడ కాలం చెల్లిన ఆహార పదార్థాలు దొరికాయని, హోటల్‌ లో శుచి, శుభ్రతా, నాణ్యత లేదని కథనాలు ప్రసారమయ్యాయి. తాజాగా ఈ విషయంపై హీరో సందీప్ కిషన్ స్వయంగా స్పందించారు. తన రెస్టారెంట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే అన్ని విషయాల మీద సందీప్ క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా నెట్టింట కనిపిస్తోన్న కొన్ని ఫొటోలు తమ కిచెన్ కి సంబంధించినవి కావాని, అయినా తమ కిచెన్ లోని ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారని సందీప్ స్పష్టం చేశారు. ‘దయచేసి మీడియా మిత్రలు ఆసక్తికరమైన హెడ్ లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు నిజాలు తెలుసుకోవాలి. మేం గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు అనే పేరుతో చాలా నమ్మకమైన సేవలు అందిస్తూ వస్తున్నాం. మీ ప్రేమాభిమానాలను ఎప్పుడూ వృధా కానీవ్వలేదు. 2022 ఎక్స్పైరీ డేట్ తో ఉన్న చిట్టి ముత్యాలు రైస్ బ్యాగ్ తమ హోటల్ లో ఉన్న మాట వాస్తవమే. కానీ అది ఇప్పటివరకు సీల్ తీయని ఒక శాంపిల్ బ్యాగ్. మా వెండర్ ఒకరు శాంపిల్ కోసం పంపితే దాన్ని ఒక పక్కగా పెట్టి ఉంచాం. ఇదే విషయాన్ని బ్యాగ్ సీల్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం ధ్రువీకరించారు’

‘ మా కిచెన్ లో నీళ్లు నిలిచిపోయాయి అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఫొటోలో అసలు నీళ్లు నిలవలేదు. అవి బయటకు వెళుతూ ఉండగా తీసిన ఫొటోస్. మేము ప్రతి గంట గంటకు కిచెన్ క్లీన్ చేస్తూనే ఉంటాం. అంతేగాక మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు మేం టేస్టింగ్ సాల్ట్స్ వంటివి అసలు ఉపయోగించం. వీటికి సంబంధించిన ఫోటోలు మా కిచెన్‌కు సంబంధించినవి కావు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కుకింగ్ అండ్ సేఫ్టీకి సంబంధం లేని చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తించారు. వాటిని కూడా మేం సరిదిద్దుకునే పనిలో ఉన్నాం. ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ విషయంలో కానీ, రుచి విషయంలో కానీ, నాణ్యతా, శుచి, శుభ్రతా విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు’ అని ప్రకటనలో క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్.

ఇవి కూడా చదవండి

సందీప్ కిషన్ ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.