మూవీ రివ్యూ: భారతీయుడు 2

నటీనటులు: కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, నెడుమూడి వేణు, సముద్రఖని తదితరులు.

ఎడిట‌ర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శంకర్

నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్

భారతీయుడు అనేది ఓ సెన్సేషన్. 28 ఏళ్ళ కింద శంకర్ నుంచి వచ్చిన ఈ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేసారు ఈ దర్శకుడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాటి భారతీయుడును మరిపిస్తుందా..? అసలు ఇప్పటి సేనాపతి ఎలా ఉన్నాడు అనేది చూద్దాం..

కథ:

చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్) తన స్నేహితులతో కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతుంటాడు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు. ఆ వీడియోలు చూసి జనం కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. వాటితోనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తాడు చిత్ర. కానీ ఎంత చేసినా.. జనంలో మార్పు రాకపోగా నానాటికి మరింత దారుణంగా మారిపోతుంది సమాజం. ఇలాంటి సమయంలో మళ్లీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే భారతీయుడు రావాలని.. కమ్‌బ్యాక్ ఇండియన్ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు చిత్ర. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఆ స్వాతంత్ర్య సమరయోధుడు అయితేనే నేటి సమాజానికి కరెక్ట్ అని భావిస్తారు వాళ్లు. అలా వాళ్ల శ్రమ ఫలించి సేనాపతి మళ్లీ తిరిగొస్తాడు. వచ్చీ రాగానే అన్యాయం చేస్తున్న వాళ్లు, అవినీతికి పాల్పడుతున్న పెద్ద తిమింగళాలను పట్టుకుని.. తనకు తెలిసిన వర్మ కళను ఉపయోగించుకుని చంపేస్తుంటాడు. ముందు సేనాపతి మాటలకు బ్రెయిన్ వాష్ అయిన చిత్ర అండ్ గ్యాంగ్.. ఆ తర్వాత తమకు జరిగిన అన్యాయాలకు కారణం భారతీయుడే అని తెలుసుకుంటారు. దాంతో గో బ్యాక్ ఇండియన్ అని ట్రెండ్ చేస్తారు. అప్పుడేమైంది.. అసలు దేశం కోసం ఇంత కష్టపడిన సేనాపతిని వాళ్లెందుకు దేశం నుంచి పొమ్మన్నారు అనేది అసలు కథ..

కథనం:

సముద్రంతో సెల్ఫీ దిగిన తర్వాత పిల్లకాలువ పక్కన నిలబడి ఫోజ్ ఇస్తే ఎలా ఉంటుంది..? భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు 2 మీద అలాగే ఉంది. 28 ఏళ్ళ కింద వచ్చిన భారతీయుడు ఇప్పటికీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయిందంటే అందులో ఉన్న కంటెంట్ కారణం. కానీ ఇప్పుడు సీక్వెల్‌లో మాత్రం బాహుబలి ఇంటర్వెల్ లో రానాను డామినేట్ చేసే ప్రభాస్ విగ్రహంలా.. సినిమా అంతా నాటి సేనాపతి.. నేటి సేనాపతిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. భారతీయుడు లాంటి సినిమాకు సీక్వెల్ అంటేనే సాహసం. అది రిస్క్ అని తెలిసినా చేశాడు శంకర్. ఓ అద్భుతం చూసాక.. మళ్ళీ అది సృష్టించడం శంకర్ వల్ల కూడా కాదు. భారతీయుడు అనేది ఓ ఎమోషన్. పైగా లంచం, అవినీతిపై ఎక్స్ పోజర్ ఈ స్థాయిలో లేదప్పుడు. అప్పట్లో అది భీభత్సంగా కనెక్ట్ అయింది. ప్రతీ సీన్ కూడా కొత్తగా అనిపించింది.. ఏం చేసినా అద్భుతం అన్నారు ఆడియన్స్ కూడా. కానీ సీక్వెల్ లో ఆ ఎమోషన్ మిస్ అయింది. ఎందుకంటే ఇంతకుమించిన అవినీతిని రోజూ టీవీల్లో, పేపర్లలో చూస్తూనే ఉన్నారు ఆడియన్స్. వాళ్లకు కొత్తగా అనిపించే సీన్స్ ఏవైనా భారతీయుడు 2లో ఉంటే చూడ్డానికి కూడా కొత్తగా ఉండేది. కానీ శంకర్ ను ముందు నుంచి ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఇదే. దీన్ని ఓవర్ కమ్ చేయడంలో ఈయన సైతం తడబడ్డాడు. స్క్రీన్ ప్లే కూడా అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తుంది. అక్కడ విక్రమ్‌ను పట్టుకోడానికి సినిమా అంతా వివేక్‌ను వెంటేసుకుని ప్రకాశ్ రాజ్ తిరుగుతుంటాడు.. ఇక్కడ కూడా అదే వివేక్‌తో బాబీ సింహా ఉంటాడు. కొన్ని శంకర్ మార్క్ సీన్స్ ఉన్నాయి.. ముఖ్యంగా సేనాపతి తిరిగొచ్చే సీన్ అదిరింది. ఇంటర్వెల్ బాగుంది.. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్.. కానీ మిగిలిన రొటీన్ సీన్స్ కారణంగా ఇవి హైలైట్ అవ్వలేదు.. 2024లో భారతీయుడు తిరిగొస్తే ఆయనకు కూడా చుక్కలు తప్పవని సినిమాలో చూపించాడు శంకర్. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ కష్టాలు తప్పకపోవచ్చు. కమల్ చెప్పినట్టు పార్ట్ 3 ఆసక్తికరంగా ఉండబోతుందని క్లైమాక్స్ లో చూపించిన షో రీల్ చూస్తే అర్థమైంది. అసలు సేనాపతి ఎవరు.. ఎక్కడ్నుంచి వచ్చాడు.. వీరశేఖరన్ సేనాపతి అనే వ్యక్తి బ్రిటీష్ వాళ్లపై ఎలా పోరాటం చేసాడు అనేది మూడో భాగంలో చూపించబోతున్నారు.

నటీనటులు:

కమల్ హాసన్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఈ వయసులోనూ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు చేసాడు కమల్. ఆ కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక సిద్ధార్థ్ కూడా ఉన్నంతలో బాగానే నటించాడు. రకుల్ చిన్న పాత్రే. ప్రియా భవానీ శంకర్ గ్యాంగ్ కూడా బాగానే ఉన్నారు. సముద్రఖని, ఎస్ జే సూర్య, గుల్షన్ గ్రోవర్ ఇలా అంతా చిన్న చిన్న పాత్రల్లోనే నటించారు. దివంగత నటులు వివేక్, నెడుమూడి వేణులను AIలో అద్భుతంగా చూపించారు.

టెక్నికల్ టీం:

అనిరుధ్ సంగీతం అంటేనే సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది. కానీ భారతీయుడు 2లో మాత్రం అది మిస్ అయిపోయింది. ఎక్కడా ఆయన మార్క్ కనిపించనే లేదు. పాటల్లేకపోవడం కూడా దీనికి మైనస్. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. రవి వర్మన్ అందులో తన పనితనం చూపించాడు. ఇక ఎడిటింగ్ వీక్ అనిపించింది. శ్రీకర ప్రసాద్ చాలా వరకు ల్యాగ్ సీన్స్ అలాగే ఉంచేసారేమో అనిపిస్తుంది. కానీ అది శంకర్ నిర్ణయం కాబట్టి తప్పు బట్టలేం. ఇక దర్శకుడు శంకర్ మేకింగ్‌లో భారీతనం కనిపించింది.. కానీ మార్క్ మిస్ అయింది. ఎక్కడా ముందు సినిమాలోని ఎమోషన్ కనిపించలేదు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా భారతీయుడు 2.. కాస్త మెప్పిస్తాడు.. కాస్త విసిగిస్తాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.