ఒకప్పుడు రాజులు, మహారాజులు తమ ప్రజల పరిస్థితులు తెలుసుకోవడానికి వ్యాపారులా, బిచ్చగాళ్లలా మారి వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు ఆ విధానం సాధ్యపడదు కానీ, కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడూ పబ్లిక్‌లో గెటప్ మార్చుకుని కనిపిస్తుంటారు. ముఖ్యంగా సినిమా నటులు తమ సినిమాల కోసం లేదా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మారువేషాల్లో బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లడం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశాడు.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పొడవాటి జుట్టుతో, పొడవాటి గడ్డంతో, రాతి యుగం వ్యక్తిలా జంతువుల చర్మాన్ని ధరించి కనిపించాడు. అతను హ్యాండ్ కార్ట్‌ను లాగుతూ ముంబై వీధుల్లో భిక్షమెడుగుతూ తిరిగాడు. చాలామంది అతని వేషధారణను చూసి షాక్ అయ్యారు. కొంతమంది అయితే భయంతో అక్కడినుంచి తప్పుకున్నారు కూడా. అయితే ఆ బిచ్చగాడిలా కనిపించిన వ్యక్తి మరెవరో కాదు.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.

ఈ వీడియో మొదట వైరల్ అయ్యే వరకు ఆ వ్యక్తి ఎవరో ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ తరువాత అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న కొన్ని బిట్స్ బయటకు రావడంతో అది ఖచ్చితంగా ఆయన అని నిర్ధారణ అయింది. ఆయన ఎందుకు అలా వేషం ధరించి జనాల్లోకి వచ్చారన్నదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇది ఆయన నటిస్తున్న కొత్త సినిమా కోసమా? లేక వేరే యాడ్ షూట్ కోసమా? అన్నది ఇప్పటికీ అధికారికంగా తెలియదు.

ఇంతకముందూ అమీర్ ఖాన్ ఇలా మారువేషాల్లో ప్రజల్లోకి వచ్చిన సందర్భాలున్నాయి. ఓ సందర్భంలో క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇంటికి కూడా వేరే గెటప్‌లో వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రజల మధ్యకెళ్లి వారి సహజ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది అమీర్ అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? లేక సినిమాల కోసం ప్రామోషన్ స్టంట్స్ చేస్తున్నారా అన్నది తేలాల్సిన విషయం. కానీ ఒక సంగతి మాత్రం నిజం.. అమీర్ ఖాన్ మరోసారి తన విచిత్ర ప్రయత్నంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *