Harikatha web series Review In Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 13, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, పూజిత పొన్నాడ, దివి వడ్త్య, సుమన్, అర్జున్ అంబటి తదితరులు

దర్శకుడు :మ్యాగీ

నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ : విజయ్ ఉలగనాథ్

ఎడిటర్: జునైద్ సిద్ధికి

సంబంధిత లింక్స్: ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి కొన్ని చిన్న చిత్రాలు సహా ఓటిటిలో కూడా పలు సిరీస్ అండ్ సినిమాలు వచ్చాయి. అలా డిస్నీ+ హాట్ స్టార్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అలాగే, నటుడు శ్రీరామ్ తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ “హరికథ” కూడా ఒకటి. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక ఈ సిరీస్ కథలోకి వస్తే.. ఈ సిరీస్ 1980 నుంచి 1990 దశకంలో అప్పటి అరకు ప్రాంతంలో జరిగిన ఆటవిక కథగా కనిపిస్తుంది. మరి అరుకులోనే ఓ గ్రామంలో దాసు పెద్దయ్యాక హరి(సుమన్) అనే తక్కువ జాతికి చెందిన కుర్రాడు ఓ హత్య కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరోపక్క రంగాచారి(రాజేంద్ర ప్రసాద్) అదే గ్రామంలో భగవంతుణ్ణి నమ్ముతూ విష్ణు అవతారలపై తమ రంగాచారి నాటక మండలి పేరిట నాటకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ నాటకాలులో ఏ అవతారం ఏ రోజు చేస్తారో అదే రీతిలో అనుమానాస్పదంగా దారుణ హత్యలు జరుగుతూ ఉంటాయి. దీనితో ఆ గ్రామ ప్రజలు ఇదంతా ఆ భగవంతుడే పలు అవతారాల్లో చేస్తున్నాడు అని బలంగా నమ్ముతారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఆఫీసర్ విరాట్(శ్రీకాంత్) రంగాచారినే అనుమానిస్తాడు. మరి ఈ క్రమంలో నెలకొన్న సస్పెన్స్ వెనుక ఉన్నది ఎవరు? వారిని ఎందుకు చెపుతున్నారు? విరాట్ స్నేహితుడు అక్కడి ఎస్సై(అర్జున్ జయత్) మరణానికి కారణం ఎవరు? రంగాచారికి జీవితంలో జరిగిన విషాదం ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో భగవంతునికి రిలేట్ చేస్తూ పలు హత్యలు ఆ అవతారాలు చేసాయి అనే విధంగా రాసుకున్న లైన్ ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాలి. డివోషనల్ టచ్ తో కొనసాగే పలు సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే విధంగా కనిపిస్తాయి. అలాగే హత్యల చుట్టూతా సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి. ఇంకా చాలా సీన్స్ ని నాచురల్ గా చూపించే ప్రయత్నం ఒకో అవతారానికి ఒక కారణం ఆ అవతారానికి తగ్గట్టుగా వ్యక్తుల మరణాన్ని డిజైన్ చేయడం బాగుంది.

ఇక నటీనటుల్లో అయితే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడో కన్నయ్య కిట్టయ్య సినిమాలో శ్రీకృషుని అవతారంలో కనిపించి మైమరిపించారు. మరి ఇందులో నాటకాలు వేసే వృద్ధుని పాత్రలో ఆ నాటకాల్లో పలు అవతారాల్లో తన నటన తాలూకా పొటెన్షియల్ అదే ఎనర్జీని మనం చూడొచ్చు. అలాగే దాసు పాత్రలో నటించిన యువ నటుడు సిరీస్ లో బాగా చేసాడు.

ఇంకా రాజేంద్ర ప్రసాద్ మనవరాలి పాత్రలో నటించిన యువ నటి డీసెంట్ లుక్స్ లో మంచి నటనతో ఆకట్టుకుంది. ఇక మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మంచి నటన ఈ సిరీస్ లో కనబరిచాడు. పలు సీరియస్ సన్నివేశాలు ఎమోషన్స్ ని తాను బాగా హ్యాండిల్ చేసాడు అని చెప్పాలి. ఇంకా ఈ సిరీస్ లో డివోషనల్ గా మెప్పించే సీన్స్ కొన్ని ఉన్నాయి. వీటితో పాటుగా చివరి మూడు ఎపిసోడ్స్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కదిలిస్తాయి. ఇంకా శ్రీకాంత్ పాత్రకి రాజేంద్ర ప్రసాద్ పాత్రకి అలాగే దాసు రోల్ కి ఇచ్చిన కనెక్షన్ డీసెంట్ గా అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా పూజిత పొన్నాడ, ఇతర నటీనటులు కూడా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో డివోషనల్ గా తీసుకున్న లైన్ బాగుంది కానీ దానిని రొటీన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించడం మాత్రం ఒకింత డిజప్పాయింట్ చేయొచ్చు. పలు ఎమోషన్స్ బాగున్నాయి కానీ ఇంకొన్ని సీన్స్ మాత్రం చాలా రోటీన్ గానే అనిపిస్తాయి. దీనితో ఇంకా బలమైన ఘర్షణ ఏమన్నా సిరీస్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది.

అలాగే పలు సన్నివేశాలు ఇంకా హై మూమెంట్స్ ఇచ్చేలా డిజైన్ చేసి ఉండాల్సింది. అలాగే ఇంకొన్ని సన్నివేశాలు అయితే కొంచెం ఓవర్ గా కూడా అనిపిస్తాయి. క్లీన్ గా వెళ్తున్న సమయంలో కొన్ని పాత్రలకి అంత అతి అవసరం లేదు అనిపిస్తుంది. మెయిన్ గా నటి దివి వడ్త్యపై ఓ ఫైట్ సీక్వెన్స్ సడెన్ గా ఓవర్ గా అనిపించక మానదు. అలాగే దాసు పాత్రలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఇంకా సిరీస్ లో కొన్ని పాటలు అయితే అనవసరం అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు యావరేజ్ అని చెప్పొచ్చు. విలేజ్ నేపథ్యం, సినిమాటోగ్రఫీ సెట్ వర్క్ బాగానే ఉన్నాయి కానీ వి ఎఫ్ ఎక్స్ మాత్రం సిరీస్ లో వీక్ గా ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ ఎఫర్ట్స్ అందుకు పెట్టాల్సింది. టైటిల్ కార్డ్స్ మాత్రం దశావతారలుపై బాగుంది. సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదు. జునైద్ సిద్దిక్కీ ఎడిటింగ్ పర్వాలేదు కథనం కొంచెం ఫాస్ట్ గా ఉండేలా కట్ చేయాల్సింది.

ఇక మ్యాగీ దర్శకత్వం విషయానికి వస్తే.. డివోషనల్ టచ్ లో దశావతారాల్లో డిజైన్ చేసిన ఎపిసోడ్స్ వాటి తాలూకా మర్డర్స్ బాగున్నాయి కానీ ఇది రొటీన్ రివెంజ్ డ్రామాగా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని పలువురు పాడు చేసి చంపెయ్యడం వారిని హతమార్చడం అనేది రోటీన్ గానే అనిపిస్తుంది కానీ దీనికి డివోషనల్ టచ్ ఇవ్వడం ఒకటే కొంచెం డిఫరెంట్ అని చెప్పాలి. అయితే తన స్క్రీన్ ప్లే కొన్ని డాట్స్ ని కలపడంలో ముఖ్యంగా సిరీస్ టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చినపుడు బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హరికథ” ఒక రొటీన్ రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు. కానీ దేవుడే హత్యలు చేస్తున్నాడు అనే పాయింట్ ఒకింత ఆసక్తి రేపుతోంది అలాగే కొన్ని సస్పెన్స్ అంశాలు ఓకే అనిపిస్తాయి. ఇలా డివోషనల్ టచ్ వరకు ఓకే అనిపిస్తుంది కానీ దీనికి తీసుకున్న రివెంజ్ ప్లాట్ మాత్రం చాలా రోటీన్ గా అనిపిస్తుంది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకొని ఈ సిరీస్ ని స్ట్రిక్ట్ గా ఒక్కసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *