లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రం శుక్రవారం (జూలై 12) దేశవ్యాప్తంగా విడుదలైంది. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  1996లో విడుదలైన ‘ఇండియన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ మొదటి షోనుంచే భారతీయుడు సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా పేలవంగా వచ్చాయి. ఈ మూవీ చూసిన చాలా మంది సినిమా నిడివి ఎక్కువగా ఉందని, అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయని విమర్శించారు. అందుకే ఈ సినిమాని కాస్త ట్రిమ్ చేయాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నాడు. సినిమాలోని అనవసరం అనిపించిన 20 నిమిషాల యాక్షన్ సీన్స్ కట్ చేస్తున్నారు. సినిమాలో కమల్ ఎంట్రీ ఆలస్యమవడం, పలు సన్నివేశాల్లో స్పీచ్ లాంటి డైలాగులు ఉండడంతో భారతీయుడు2 సినిమా నెగెటివ్ టాక్ కు కారణమైంది. ఈ కారణంతో సినిమా విడుదలైన మూడో రోజే కొన్ని యాక్షన్ సీన్లు కట్ చేయాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నాడు.

సినిమాలోని చాలా అనవసరమైన సన్నివేశాలను తొలగించి, మొత్తానికి 20 నిమిషాలు కుదించారు. ముందుగా భారతీయుడు 2 చిత్రం సుమారు 3 గంటల రన్‍టైమ్‍తో వచ్చింది. ఇప్పుడు.. ట్రిమ్ చేశాక 2 గంటల 40 నిమిషాలకు తగ్గనుంది. భారతీయుడు సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించారు. 1996లో విడుదలైన ‘ఇండియన్‌’ సినిమాలోని సేనాపతి పాత్రనే ఈ సినిమాలోనూ కొనసాగించారు. ఈ సినిమాలో కూడా సేనాపతి లంచం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందించారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ‘భారతీయుడు 2’ సినిమాకు రూ.12 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెగిటివ్ టాక్, మరోవైపు సీన్లు తీసేసిన దృష్ట్యా ఆడియెన్స్ ఏ మేరకు థియేటర్లకు వెళ్తారనేది చూడాలి?