గజ్వేల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, సాగునీరు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

ఆషాడ బోనాలు వేడుకల్లో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ పరిస్థితి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నీటి కొరతతో పంటలు ఎండిపోతున్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాజకీయ విభేదాలు పక్కనబెట్టి రైతుల సంక్షేమం కోసం సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

రైతులను ఆదుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందని హరీశ్‌రావు కొనియాడారు.

ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఆలయ కమిటీని ఆయన అభినందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను గమనించిన ఆయన మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.