హైదరాబాద్: బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

మహేశ్వరంలోని ఖిల్లా మైసమ్మ ఆలయంలో సోమవారం కాంగ్రెస్ మహేశ్వరం ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి అధికారిక ప్రోటోకాల్ లేనప్పటికీ కార్యనిర్వహణాధికారి (ఈవో) వేదికపైకి ఆహ్వానించిన సంఘటన జరిగింది. ప్రోటోకాల్ లేని వారిని వేదికపైకి ఎలా ఆహ్వానిస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈఓ నిర్ణయాన్ని ప్రశ్నించారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది.

చెక్కులు స్వీకరించే వారిని మాత్రమే సమావేశ మందిరంలోకి అనుమతించామని, ఎమ్మెల్యే వెంట వచ్చే అనుచరులను అనుమతించేది లేదని పోలీసులు, ఈఓ స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వేదికపై బైఠాయించి నిరసన తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులను వేదికపైకి అనుమతించడంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.