Published on Dec 25, 2024 5:01 PM IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ‘పుష్ప-2’ మేకర్స్, హీరో అల్లు అర్జున్, పలువురు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు ఆరా తీసుకుంటున్నారు. ఇక ఇటీవల అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను పరామర్శించి, అతడి ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
తెలుగు ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు కూడా శ్రీతేజ్‌ను పరామర్శించారు. ఈ క్రమంలో తాజాగా శ్రీతేజ్ చికిత్సతో పాటు అతనికి అండగా ఉంటామని తెలిపిన అల్లు అర్జున్ రూ. కోటి రూపాయలు.. పుష్ప చిత్ర నిర్మాతలు రూ.50 లక్షలు.. దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు తమ వంతు సాయంగా అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించి రూ.2 కోట్ల చెక్కును అల్లు అరవింద్ FDC చైర్మన్ దిల్ రాజుకి అందజేశారు.
శ్రీతేజ్ ఇప్పుడు కోలుకుంటున్నాడని.. అతనికి వెంటిలేషన్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని.. పుష్ప-2 యూనిట్ తనకు రూ.2 కోట్ల చెక్కును అందజేశారని దిల్ రాజు ప్రకటించారు. ఇక ఆ అమౌంట్‌ను భాస్కర్ కుటుంబానికి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అటు గురువారం ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు కలవబోతున్నట్లు దిల్ రాజు తెలిపారు.