Drinker Sai Movie Review in Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 27, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, బద్రం, SS కాంచీ, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్‌బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్

దర్శకుడు : కిరణ్ తిరుమలశెట్టి

నిర్మాతలు : బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్ & బసవరాజు లహరిధర్

సంగీత : శ్రీ వసంత్

సినిమాటోగ్రఫీ : ప్రశాంత్ అంకిరెడ్డి

కూర్పు: మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్: ట్రైలర్

కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

డ్రింకర్ సాయి (ధర్మ) మరో పని లేకుండా అదే పనిగా నిత్యం తాగుతూ తాగుబోతుగా గుర్తింపు తెచ్చుకుంటాడు. సాయికి కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నా.. తల్లిదండ్రులు మాత్రం అప్పటికే చనిపోయి ఉంటారు. ఈ నేపథ్యంలో సాయి తాగుడికి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మరోవైపు బాగీ (ఐశ్వర్య శర్మ) న్యాచురోపతిని గుడ్డిగా నమ్ముతుంది. పైగా మంచి క్రమశిక్షణతో పాటు, మంచి ఆరోగ్య అలవాట్లు ఉన్న బాగీ జీవితంలోకి డ్రింకర్ సాయి ఎంట్రీ ఇస్తాడు. ఆమె వెంటే పడుతూ ఆమెను సాయి ప్రేమించేపనిలో ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో డ్రింకర్ సాయి – బాగీల మధ్య ఎలాంటి ప్రేమ కథ నడిచింది ?, అసలు బాగీ డ్రింకర్ సాయిని ప్రేమిస్తుందా ? లేదా ?, ప్రేమిస్తే దానికి గల కారణాలు ఏమిటి ?, ఇంతకీ.. డ్రింకర్ సాయిలో మార్పు వస్తోందా ? రాదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ డ్రింకర్ సాయి సినిమాలో కొన్ని భావోద్వేగాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్‌ కూడా పర్వాలేదు. ఇక ఈ సినిమాలో ధర్మ పోషించిన ప్రధాన పాత్ర అయిన డ్రింకర్ సాయి పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన డ్రింకింగ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్ పర్వాలేదు. మొత్తంగా డ్రింకర్ సాయి సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని ప్రేమ సన్నివేశాల పరంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో హీరోగా నటించిన ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఐశ్వర్య శర్మ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో నటించిన పోసాని కృష్ణమురళి, సమీర్, బద్రం, SS కాంచీ, కిరాక్ సీత, రీతూ చౌదరి, ఫన్‌బకెట్ రాజేష్, రాజా ప్రజ్వల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ ‘డ్రింకర్ సాయి’ స్క్రీన్ ప్లే స్లోగా సాగుతూ కొన్ని చోట్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే, సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో ధర్మ క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగాలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. అసలు, ఈ జనరేషన్ లో ఇలాంటి మెలోడ్రామా ప్రేమ కథలను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారనేది డౌటే. పైగా ఉన్న కంటెంట్ లో కూడా ఫ్రెష్ నెస్ మిస్ అయ్యింది.

అయితే, దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి పనితనం కొన్నిసన్నివేశాల్లో ఆకట్టుకునే విధంగా సాగినా, ల్యాగ్ సీన్స్ విషయంలో దర్శకుడు ముందే జాగ్రత్త పడి ఉండాల్సింది. పైగా కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సెకండ్ హాఫ్ కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని లవ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా.. మొత్తమ్మీద ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అయ్యింది.

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పుకున్నట్టే.. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు శ్రీ వసంత్ సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ప్రశాంత్ అంకిరెడ్డి వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్ & బసవరాజు లహరిధర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘డ్రింకర్ సాయి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. కొన్ని బరువైన భావోద్వేగాలు పర్వాలేదు. ఐతే, కథాకథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని బోల్డ్ అండ్ లవ్ సీన్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *