Tue. Mar 24th, 2026
Sarkar 4: రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్య రాయ్ అవుట్!

Sarkar 4: శివ సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగి అగ్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మార్క్ పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘సర్కార్’. ఈ సినిమా సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం రాబోతున్న నేపథ్యంలో, చిత్ర తారాగణంపై వస్తున్న వార్తలకు తాజాగా ఆర్జీవీ చెక్ పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.

READ ALSO: Puri Jagannadh : పూరీకి ‘బిగిసిన ఉచ్చు’..సినిమాలు బ్యాన్?

ఇటీవల ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సర్కార్ 4లో ఐశ్వర్య రాయ్ నటించడం లేదు. కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు” అని స్పష్టం చేశారు. 2008లో వచ్చిన ‘సర్కార్ రాజ్’లో ఐశ్వర్య ‘అనితా రాజన్’ అనే కీలక పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో భాగంలో ఆమె పాత్ర ఉండదని వర్మ తేల్చి చెప్పారు. ఈసారి సినిమా ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు వర్మ ఆసక్తికర సమాధానమిచ్చారు. “మునుపటి భాగాల కంటే ‘సర్కార్ 4’ ప్రపంచం చాలా పెద్దదిగా ఉంటుంది. కథలో లోతు ఎక్కువగా ఉండటమే కాకుండా, ప్రతి సన్నివేశాన్ని చాలా వివరంగా చూపిస్తాను. ముఖ్యంగా తెర వెనుక జరిగే రాజకీయ వ్యూహాలను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేయబోతున్నాను. నా స్టైల్ క్లోజప్ షాట్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి” అని వర్మ వివరించారు.

వచ్చే నెల నుంచే షూటింగ్..
రెడ్ లాఫ్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న వర్మ, ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. 2005లో ‘సర్కార్’తో మొదలైన ఈ ప్రయాణం, 2008లో ‘సర్కార్ రాజ్’, 2017లో ‘సర్కార్ 3’తో కొనసాగింది. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘సర్కార్ 4’ పట్టాలెక్కబోతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి ‘సుభాష్ నాగ్రే’గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని రామ్ గోపాల్ వర్మకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో అని ఆయన అభిమానులు ఉఠ్కంటతో ఎదురు చూస్తున్నారు.

READ ALSO: Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?