Thu. Mar 26th, 2026
Dawood Ibrahim: ‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక అసలు నిజాలివే!

ఇటీవల ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్-2’లో దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానం ప్రేక్షకుల్లో కొత్త చర్చకు తెరలేపింది. మంచాన పడి ఉన్న దావూద్‌ను చూశాక, అసలు అతను బతికే ఉన్నాడా? లేక ఇది కేవలం కల్పితమా? అన్న అనుమానాలు సామాన్యుల్లో మొదలయ్యాయి. అయితే, వాస్తవ ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం ప్రస్థానం ఒక సామాన్య కానిస్టేబుల్ కొడుకు స్థాయి నుండి గ్లోబల్ టెర్రరిస్ట్ వరకు ఎలా సాగిందో తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 1955లో రత్నగిరిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో జన్మించిన దావూద్, క్రమశిక్షణ గల జీవితాన్ని కాదని నేర బాట పట్టాడు. చదువు మధ్యలోనే ఆపేసి, ముంబై డాన్ హాజీ మస్తాన్ నీడలో అండర్ వరల్డ్ ఓనమాలు నేర్చుకున్నాడు. తన సోదరుడు సబీర్ ఇబ్రహీంతో కలిసి ‘డి-కంపెనీ’ని స్థాపించి, అప్పటి వరకు ముంబైని శాసించిన పఠాన్ గ్యాంగ్‌ను మట్టికరిపించాడు. అతి తక్కువ కాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌కు అప్రకటిత రాజుగా అవతరించాడు. దావూద్ జీవితాన్ని, భారత్‌తో అతని బంధాన్ని శాశ్వతంగా తెంచేసింది 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI)తో చేతులు కలిపి, 257 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తర్వాత దావూద్ భారత్ నుండి పరారయ్యాడు. దుబాయ్ మీదుగా పాకిస్థాన్ చేరుకున్న అతను, అప్పటి నుండి కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తలదాచుకుంటున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Additionally Learn :Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!

దావూద్ గురించి ప్రపంచానికి తెలిసిన చివరి స్పష్టమైన ఫోటో తన కుమార్తెను పాక్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసినప్పటిది. ఆ తర్వాత అతను అజ్ఞాతానికే పరిమితమయ్యాడు. గతంలో అతనిపై విషప్రయోగం జరిగిందని, ప్రస్తుతం అతను గ్యాంగ్రీన్, తీవ్రమైన డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలో చూపించినట్లుగా అతను మంచానికే పరిమితమయ్యాడా? లేక ఇంకా తెర వెనుక ఉండి తన సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడా? అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం దావూద్ వేటను ఆపలేదు. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను నిలదీస్తూనే, మరోవైపు భారత్‌లో ఉన్న అతని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఇటీవల రత్నగిరిలోని అతని పూర్వీకుల భూములను వేలం వేయడం ద్వారా, అతని ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రక్రియను భారత్ వేగవంతం చేసింది.