Producer Suresh Babu : కె.బాపయ్య మంచి కథ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో.. అప్పటికే చలిచీమలు, సమాధి కడుతున్నాం చందాలివ్వండి, ఈ చరిత్ర ఏ సిరాతో లాంటి సామ్యవాద భావాలతో కూడిన చిత్రాలకు కథలు రాసి సాధారణ విజయాలతో ముందుకు వెళుతున్న పరుచూరి సోదరులను కలవడం జరిగింది. వారు బాపయ్యతో కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

1983 సురేష్ ప్రొడక్షన్స్, కె.బాపయ్య దర్శకత్వంలో మల్టీస్టారర్ “ముందడుగు” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. మరో ప్రధాన పాత్రలలో గుమ్మడి వెంకటేశ్వరరావు, శివకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. శివకృష్ణ అభ్యుదయ భావాలు గల వ్యక్తి సమసమాజ స్థాపన ద్యేయంగా.. శివకృష్ణ తమ ఆస్తిని ప్రజలకు పంచుతాడు.పెట్టుబడిదారి విధానం ఆలోచనల గల రావుగోపాల్ రావు ఒక సంస్థను స్థాపిస్తారు. శోభన్ బాబు కోటీశ్వరుడుగా నటించగా.. హీరో కృష్ణ లారీడ్రైవర్ గా నటించారు. సామ్యవాద కమ్యూనిజం సిద్ధాంతాల భావజాలం చుట్టూ కథ నడుస్తుంది. కమర్షియల్ హంగులు అద్దడంతో ఆ రోజుల్లో ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్మాత డి.రామానాయుడు రజతోత్సవాన్ని చెన్నై “తాజ్ హోటల్” లో నిర్వహించారు. అయితే ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ టీవీ కార్యక్రమంలో పరుచూరి సోదరులు అలాగే దగ్గుపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. ఆనాటి జ్ఞాపకాలను సురేష్ బాబు గుర్తు చేసుకుంటూ… ‘ముందడుగు’ చిత్రం రచయిత దర్శకులు అలాగే నటీనటుల ఎంపిక తన కళ్లెదుటే జరిగిందని.. సురేష్ ప్రొడక్షన్స్ లో డైలాగ్స్ తో నడిచిన ఏకైక చిత్రం ముందడుగు. సినిమా తీయాలనుకున్న మొదట్లో.. రచయిత వియత్నం వీడు కథ చెప్పిన నచ్చకపోవడంతో.. ఆ తర్వాత మా నాన్నగారు విజయవాడలోని ఓ సిని ఆఫీసులో పరుచూరి బ్రదర్స్ చిన్న సినిమాలకు మాటలు రాస్తున్నారు. వెళ్లి వారిని సంప్రదించండని చెప్పారు. అప్పుడు దర్శకుడు బాపయ్య పరుచూరి బ్రదర్స్ ని సంప్రదించారు.

పరుచూరి బ్రదర్స్ మా ఇంటికి వచ్చి కథ చెప్పడంతో మా అందరికీ నచ్చింది. అలా ముందడుగు సినిమా ప్రారంభమయ్యింది. అయితే ఆ సినిమా థియేటర్లో నడుస్తున్న సమయంలో కృష్ణ శోభన్ బాబు ఫైట్ రాగానే వారిద్దరి ఫ్యాన్స్ గోల, గోల చేసేవారు. హీరో కృష్ణ పై శోభన్ బాబు ఒక దెబ్బ ఎక్కువ కొట్టగానే.. కృష్ణ ఫ్యాన్స్ అరిచేవారు. కృష్ణ పాట రాగానే శోభన్ బాబు ఫ్యాన్స్ థియేటర్ నుంచి బయటకు వెళ్లేవారు. ఆ రోజుల్లో సినిమా నడిచే సమయంలో ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హంగామా చేసేవారని నిర్మాత డి సురేష్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.