Sun. May 31st, 2026
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్‌కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!

Bobby Deol: ఐపీఎల్ 2026 సీజన్‌ ముగింపుకు చేరువలో ఉంది. ఈ మొత్తం సీజన్‌లో గెలుపు.. ఓటములతో సంబంధం లేకుండా ఒక ప్లేయర్ మాత్రం విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ టీంలతో సంబంధం లేకుండా యావత్ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఈ బుడ్డోడిపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉందంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం ఈ బిహార్ యువ సంచలనంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి ఆటపై మనసు పారేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్, ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ సైతం వైభవ్ బ్యాటింగ్‌ స్టైల్‌కు ఫిదా అయిపోయారు. తన రాబోయే చిత్రం ‘బందర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్, వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడాలి”
ఈ సందర్భంగా బాబీ డియోల్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్స్ వల్ల ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లను ఎక్కువగా చూడలేకపోయానని అన్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే దాదాపు సెంచరీ మార్కును టచ్ చేసిన ఇన్నింగ్స్ గురించి యాంకర్ ప్రస్తావించగా బాబీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “అతడొక అద్భుతం. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి ప్రతిభ చూపించడం అసాధారణం. దేవుడు ఆ బుడ్డోడిని చల్లగా చూడాలి, అతనికి ఎవరి దిష్టి (చెడు దృష్టి) తగలకుండా కాపాడాలి” అంటూ బాబీ డియోల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఒకవైపు వైభవ్ ఆటపై ప్రశంసలు కురుస్తున్నప్పటికీ, శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి రాజస్థాన్ నిష్క్రమించడంతో, 15 ఏళ్ల వైభవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసిన వైభవ్ దృశ్యాలు అభిమానులను సైతం కదిలించాయి.

ఇక బాబీ డియోల్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బందర్’ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ ‘సమర్ మెహ్రా’ అనే రాక్‌స్టార్ పాత్రలో కనిపించబోతున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అత్యాచారం అనే తప్పుడు కేసులో ఇరుక్కుని, జైలు పాలైన తర్వాత ఒక రాక్‌స్టార్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.