Sun. May 31st, 2026
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి

Ajay Bhupathi: టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ సమర్పణలో, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రెజెంట్స్ కింద తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమా ద్వారా సరికొత్త జంట శ్రీను (జై కృష్ణ), మంగ (రాశ) వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో దర్శకుడు అజయ్ భూపతి సినిమా విశేషాలను పంచుకున్నారు.

రియల్ సూపర్ స్టార్ కృష్ణ గారే ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జై కృష్ణను హీరోగా పరిచయం చేయడంపై స్పందిస్తూ “ఈ ఫ్యామిలీ నుంచి ఒక హీరోను లాంచ్ చేయడమంటే చాలా బాధ్యత, వెయిట్ ఉంటుంది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోల గురించి మాట్లాడితే కృష్ణ గారి ప్రస్తావన లేకుండా చర్చ ముగియదు. ఆయన గురించి ఎవరూ ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడటం నేను చూడలేదు” అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. “తిరుపతి దగ్గర పులిగొండలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఒక ఆటో డ్రైవర్, కృష్ణ గారి మనవడు హీరోగా చేస్తున్నాడని తెలిసి.. తన చేతిపై ఉన్న కృష్ణ గారి పచ్చబొట్టును చూపించాడు. కృష్ణ గారికి అంతటి హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉన్నారు” అని అన్నారు. టెక్నికల్ పరంగా, కథల పరంగా కృష్ణ గారు చేసినంత రిస్క్ ఏ హీరో చేయలేదని, ఆ రిస్క్ తీసుకునే క్వాలిటీస్ జై కృష్ణలో కూడా ఉన్నాయని కొనియాడారు.

పైకి శాంతంగా కనిపించే జై కృష్ణ చాలా ఫాస్ట్‌గా ఉంటాడని, అన్ని రకాల క్వాలిటీస్ (ఫైట్స్, డ్యాన్స్, గ్రేస్) అతనిలో ఉన్నాయని అన్నారు. అలాగే హీరోయిన్ రాశ గురించి మాట్లాడుతూ.. “నేను పని చేసిన హీరోయిన్లలో తను ది బెస్ట్ యాక్ట్రెస్. వీరిద్దరూ స్క్రీన్‌పై పోటీ పడి నటించారు, వీళ్ల కెమిస్ట్రీ థియేటర్లలో అద్భుతంగా ఉంటుంది” అని ప్రశంసించారు. నా సినిమాల్లో ఎప్పుడూ మ్యూజిక్ చాలా బాగుండాలని కోరుకుంటానని, ‘RX 100’, ‘మంగళవారం’ చిత్రాల తరహాలోనే ‘శ్రీనివాస మంగాపురం’ ఆడియో కూడా 100% బ్లాక్‌బస్టర్ అవుతుందని అజయ్ భూపతి ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయని, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ప్రతి ట్యూన్‌ను కేవలం రెండు గంటల్లోనే అద్భుతంగా కంపోజ్ చేశారని చెప్పారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ గారు కూడా సాంగ్స్ విని సినిమా ఆడియో హిట్ అని మెచ్చుకున్నారని తెలిపారు. అశ్వినీదత్ గారు ప్రతిరోజూ ఫోన్ చేసి వర్క్ అప్‌డేట్స్ అడగడం, తనను గైడ్ చేయడం ఒక అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నట్లు అజయ్ భూపతి ఎమోషనల్ అయ్యారు. సినిమాను కంప్లీట్ అవుట్‌డోర్ బ్యాక్‌డ్రాప్‌లో, రెండు విభిన్న కథాంశాలతో తెరకెక్కించామని, ఈ సినిమా అసలు కథేంటో త్వరలోనే విడుదల కాబోయే ట్రైలర్‌లో రివీల్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ చిత్రానికి కాసర్ల శ్యామ్, శ్రీమణి వంటి ప్రముఖ రచయితలు సాహిత్యం అందించారన్నారు.