Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు కూడా కళ వచ్చిందని చెప్పాలి. గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు చేసింది అంటూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం సినీ నటుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా ఈయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తరుణంలో చిత్ర పరిశ్రమకు తన వంతు సహాయం చేయబోతున్నారు. ఇప్పటివరకు చిత్ర పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్ లో ఎన్నో స్టూడియోలు ఉన్నాయి కానీ ఏపీలో ఎలాంటి స్టూడియోలు లేవు దీంతో 100 ఎకరాల విస్తీర్ణంలో భారీ స్టూడియో నిర్మించడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే సినీ పెద్దలతో కలిసి పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చర్చలు కూడా జరపారని తెలుస్తుంది. అయితే ఈ స్టూడియో నిర్మాణం తెలంగాణకు ఆంధ్రకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేయబోతున్నారట. కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల వద్ద భారీ స్టూడియోకు ప్లాన్ జరుగుతున్నది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

కృష్ణాజిల్లాలో..
ఇక్కడ కనుక స్టూడియో నిర్మిస్తే రాకపోకలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌కు 4 గంటల ప్రయాణం, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్‌, రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ప్రాంతం స్టూడియో నిర్మాణానికి ఎంతో అనువైనదిగా భావించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో చిత్ర పరిశ్రమకు కొత్త వెలుగులు వచ్చాయని తెలుస్తుంది.