• స్టోర్ ప్రారంభోత్సవానికి జీవా
  • రిపోర్టర్స్ వరుస ప్రశ్నలు
  • కోపోద్రిక్తుడైన హీరో జీవా

తమిళ్ హీరో జీవా ఓ రిపోర్టర్‌తో వాగ్వాదానికి దిగారు. హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది కదా.. అలాంటి సంఘటనలు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయా? అని రిపోర్టర్‌ ప్రశ్నించగా జీవా కోపోద్రిక్తుడయ్యారు. ఇలాంటి చోట ఏం ప్రశ్నలు అని అంటూ.. నీకు అసలు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆదివారం తేనిలోని ఓ టెక్స్‌టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన జీవా.. అక్కడికి వచ్చిన అభిమానులతో ఫొటోలు దిగారు. ఆ సమయంలో కొందరు రిపోర్టర్స్ ఆయనను ప్రశ్నలు అడిగారు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయా? అని అడగ్గా.. ‘చాలా రోజుల తర్వాత తేనీకి వచ్చాను. చాలా పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం మా పని. కేరళలో లాగా తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, వివాదాలు లేవు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే సమాధానమిచ్చా. ఓ మంచి కార్యక్రమానికి వచ్చిన నన్ను ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు అడగవద్దు’ అని జీవా బదులిచ్చారు.

Also Read: Happy Birthday Pawan Kalyan: నీలాంటి నాయకుడే కావాలి.. అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: చిరు

మీరు నటులు కాబట్టే చిత్ర పరిశ్రమలో వస్తున్న ఆరోపణలపై మేం ప్రశ్నలు అడిగాం అని జీవాతో ఓ రిపోర్టర్‌ అన్నారు. రిపోర్టర్ అలా అనగానే.. జీవా కోపోద్రిక్తుడయ్యారు. ‘నేను పదే పదే సమాధానం చెప్పలేను, నీకు ఏమైనా బుద్ధుందా?’ అని మండిపడ్డారు. అక్కడున్న విలేకరులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. వెంటనే కొందరు జీవాను అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన అక్కడ కలకలం సృష్టించింది.