Varalakshmi Sarath Kumar Sabari Movie Review
కథ : సంజన ఓ సింగిల్ మథర్. పెద్దల్ని ఒప్పించి అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.అయితే అతను వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం వల్ల.. ఆమె మనసు విరిగిపోతుంది. తర్వాత ఆ విషయమై వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అతన్ని వదిలేస్తుంది.తర్వాత కూతురు రియా (బేబీ నివేక్ష)ను తీసుకుని వేరే ఊర్లో అద్దె ఇంట్లో దిగుతుంది. ఈ క్రమంలో సూర్య (మైమ్ గోపీ) అనే మానసిక రోగి సంజనని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో క్లాస్ మేట్ అయిన రాహుల్ (శశాంక్) ఆమెకు సాయం చేస్తాడు. అయితే సూర్య.. సంజనని ఎందుకు చంపాలనుకుంటాడు? సంజన గతం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ : వరలక్ష్మీతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ తీయొచ్చు అనే ఐడియాకి గాను దర్శకుడు అనిల్ కాట్జ్ ని తప్పనిసరిగా అభినందించాల్సిందే. ఎందుకంటే వరలక్ష్మీకి ఇండివిడ్యువల్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అందువల్ల ఈ కథ ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది. వరలక్ష్మి-మైమ్ గోపి ..ల మధ్య వచ్చే సన్నివేశాలు, థ్రిల్ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయి. వరలక్ష్మి పాత్రకి పెట్టిన బ్యాక్ స్టోరీ కూడా బాగా కుదిరింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి కథ పరుగులు పెడుతూ ఉంటుంది.సెకండాఫ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కావచ్చు, వరలక్ష్మీ చేసిన యాక్షన్ సీన్లు కావచ్చు ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక గోపీసుందర్ అందించిన సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రాఫర్లు రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి..ల పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ మైమ్ గోపి ఎంట్రీ సీన్ తో పాటు, తన హౌస్ లో ఒకరిని మర్డర్ చేసే సీన్,అలాగే యాక్సిడెంట్ ఎపిసోడ్స్ ను చాలా బాగా చిత్రీకరించారు. వాటికి పెట్టిన ఫ్రేమ్స్ కూడా ఆకట్టుకుంటాయి.
నటీనటుల విషయానికి వస్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటివరకు చేసిన పాత్రల్లోకల్లా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సంజన పాత్ర. చాలామందికి ఇది ఆదర్శంగా కూడా ఉంటుంది. సమాజంలో ఉండే సింగిల్ మథర్స్ ఈ పాత్రకి రిలేట్ అయ్యే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. సినిమా స్టార్టింగ్‌లో కమిట్మెంట్ అడిగిన ఓ వ్యక్తికి.. ఈమె వార్నింగ్ ఇచ్చే సీన్ కావచ్చు.. అక్కడ వచ్చే డైలాగులు కావచ్చు.. చాలా నేచురల్ గా ఉంటాయి. అవి చూస్తే వరలక్ష్మీ పాత్రలో ఎంతలా ఒదిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మైమ్ గోపి మరోసారి తన మార్క్ విలనిజం చూపించాడు. శశాంక్ కూడా బాగా చేశాడు. మిగిలిన నటీనటులు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు.
చివరి మాట : ‘శబరి’ ఆద్యంతం అలరించే, థ్రిల్ ఇచ్చే..ఓ సైకలాజికల్ థ్రిల్లర్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు. సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ మిస్ అవ్వొద్దు.
రేటింగ్ : 3.5/5