ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య తిరిగి థియేటర్లలో విడుదలైంది. 1998లో వచ్చినప్పుడు ఈ చిత్రం మాస్టర్ పీస్‌గా గుర్తింపు పొందింది. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని జెడి చక్రవర్తికి ఇమేజ్ తెచ్చిపెట్టింది. మనోజ్ బాజ్ పాయ్‌ను ఒక్కరాత్రిలో స్టార్‌గా మార్చిన చిత్రం ఇదే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్‌స్టర్ డ్రామాను అత్యంత ఇంటెన్స్‌గా తీర్చిదిద్దిన విధానం సినీ ప్రియుల మనసుల్ని దోచుకుంది.
సత్య సినిమా చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. గాడ్ ఫాదర్, నాయకుడు వంటి చిత్రాల సరసన సత్య కూడా స్థానం పొందింది. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత సత్య మళ్లీ థియేటర్లలో విడుదల కావడం సినీ అభిమానులకు పండగగా మారింది. రీమాస్టర్ చేసిన నూతన ప్రింట్ చూసిన ప్రేక్షకులు విభిన్న అనుభూతి పొందారు. ఈ రీ-రిలీజ్ రామ్ గోపాల్ వర్మను కూడా కదిలించింది.
వర్మ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ, “సత్య తీసిన సమయంలో నాలో ఉన్న నిజాయితీ ఇప్పుడు కనిపించడంలేదని, ఆ చిత్రం తనకు కొత్త చైతన్యాన్ని ఇచ్చిందని, ఇకపై మరింత రియల్ ఫిల్మ్‌మేకర్‌గా ముందుకు సాగుతానని” చెప్పుకొచ్చారు. ఈ జ్ఞానోదయం నిజమైనదై ఉంటే, తన నుంచి మరో అద్భుతం చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, భూత్ వంటి క్లాసిక్స్ తీసిన వర్మ, ఇటీవల కొంతకాలంగా వివాదాస్పద సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. అయినప్పటికీ, సత్య రేంజ్‌కి చేరకపోయినా, మరొక మంచి సినిమా తీసి మళ్లీ తన స్థాయిని రుజువు చేస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అయితే, వర్మను గెస్ చేయడం చాలా కష్టం! ఇప్పుడు కనిపించిన ఈ మార్పు పాతకాలం వర్మను మళ్లీ తీసుకురావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.