సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు అవకాశాలు రావడం సాధారణమే. అయితే, అందరికీ అందే అవకాశాలు విజయాన్ని అందించవు. కొందరు నటీమణులు అవకాశాలు వచ్చినా, సరైన గుర్తింపు పొందలేక పోతుంటారు. తాజాగా, ఒక తమిళ నటి తన కెరీర్ నాశనానికి ఓ స్టార్ హీరో సినిమానే కారణమని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్.
తమిళ సినీ పరిశ్రమలో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు పొందిన మనోచిత్ర, అనేక భాషల్లో నటించింది. తెలుగులో ఆమె “మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో” సినిమా ద్వారా పరిచయం అయింది. “నాటు కోడి” (2020), “జై సేన” (2021) సినిమాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, అజిత్ నటించిన “వీరం” సినిమాలో తన అనుభవమే తన కెరీర్‌ను నాశనం చేసిందని ఆమె తాజాగా వెల్లడించింది. 2014లో విడుదలైన ఈ చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వం వహించారు.
“వీరం” షూటింగ్ సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని మనోచిత్ర తెలిపారు. దర్శకుడు తనకు చెప్పిన కథలో ముఖ్యపాత్రననే నమ్మినా, షూటింగ్ ప్రారంభమైన తర్వాత తన పాత్ర పూర్తిగా మార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అన్యాయమే తన సినీ కెరీర్‌కు మలుపు తీసుకువచ్చిందని, సినిమా విడుదలైన తర్వాత అవకాశాలు తగ్గిపోయాయని వెల్లడించింది.
ఈ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో అవకాశాలు, సమర్థత కంటే, రాజకీయాలు, పలు ఇబ్బందులు నటీమణుల కెరీర్‌పై ఎలా ప్రభావం చూపిస్తాయో మనోచిత్ర ఉదాహరణగా మారింది.