
సినీ పరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు సమానంగా పారితోషికం ఇవ్వాలా? అనే చర్చ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇది హాట్ టాపిక్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు తమ జీతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న నటి రమ్య ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రమ్య మాట్లాడుతూ – “నా కెరీర్ ప్రారంభంలో నాకంటే తక్కువ పారితోషికం తీసుకునే నటులు, సినిమాలు హిట్ అయిన వెంటనే 5 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునేవారు. ఒక నటుడు 5 కోట్లు సంపాదిస్తే, నాకు కేవలం 1 కోటి మాత్రమే వచ్చేది. ఇదే వృత్తి, ఇదే కష్టం.. కానీ హీరోలే ఎక్కువగా ఎందుకు సంపాదిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
ఆమె ఇంకా చెప్పిన విషయాల్లో మహిళా ప్రధాన సినిమాలకూ సరైన ప్రాధాన్యత రానట్లుందని తెలిపారు. “విద్యా బాలన్ లాంటి గొప్ప నటి కూడా దక్షిణాది ప్రేక్షకుల్లో అంతగా గుర్తింపు పొందలేదు. హీరోయిన్లు ఒక సినిమా హిట్ ఇవ్వకపోతే అవకాశాలు తగ్గిపోతాయి. కానీ హీరోలు కనీసం ఒక్క హిట్ ఇచ్చినా.. వారికి 10 కొత్త ప్రాజెక్టులు వస్తాయి” అంటూ ఇండస్ట్రీలోని లింగ వివక్షను ఎత్తిచూపారు.
సినిమా రంగంలో లింగ సమానత్వం రావాలంటే పారితోషిక వ్యత్యాసాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. నటీమణులకు కూడా సమాన అవకాశాలు, సమాన పారితోషికం రావాలని ప్రేక్షకులు, నిర్మాతలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.