ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతున్న మహా కుంభమేళా కు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ పవిత్రమైన కుంభమేళా కేవలం సాధారణ ప్రజలకే కాకుండా, సినీ తారలకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మీనన్, శ్రీనిధి శెట్టి, బింధుమాధవి, ప్రియాంక జైన్, రాజ్‌కుమార్ రావు లాంటి సెలబ్రిటీలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. ఇప్పుడు, మరో టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కుంభమేళాలో పాల్గొని తన ఆధ్యాత్మిక యాత్రను సోషల్ మీడియాలో పంచుకుంది.
సంప్రదాయ దుస్తులు ధరించి, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన సోనాల్, ఆ తర్వాత సూర్య నమస్కారం చేసి తన భక్తిభావాన్ని వ్యక్తం చేసింది. తన ఆధ్యాత్మిక అనుభూతిని ఫోటోస్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. హిందీలో అనేక చిత్రాల్లో నటించిన సోనాల్ చౌహాన్, తెలుగులో “రెయిన్ బో” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత “లెజెండ్, డిక్టేటర్, రూలర్” వంటి సినిమాల్లో బాలకృష్ణతో కలిసి నటించింది.
అలాగే, “పండగ చేస్కో, షేర్, ది ఘోస్ట్, ఆదిపురుష్” వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “F3” లో స్పెషల్ సాంగ్ చేసింది. తన గ్లామర్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మంచి గుర్తింపు సంపాదించిన సోనాల్, ప్రస్తుతం హిందీలో కూడా అవకాశాలు వెతుకుతుంది. అయితే, బాలీవుడ్లో ఇంకా బిగ్ బ్రేక్ దక్కించుకోలేకపోతున్నప్పటికీ, తన ఫ్యాషన్ ఫోటోషూట్స్, సోషల్ మీడియా యాక్టివిటీ ద్వారా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్ర ఫోటోలు పంచుకోవడంతో, నెట్టింట కొత్త చర్చ మొదలైంది. సినీ తారలు తమ కెరీర్ తో పాటు, వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికత ను కూడా ప్రదర్శించడం, అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది. మహా కుంభమేళాలో సోనాల్ చేసిన పుణ్యస్నానం, భక్తి ఫోటోలు మరిన్ని సెలబ్రిటీలను కూడా ఆకర్షించే అవకాశం ఉంది.