
టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మధ్య ఉన్న అనుబంధం ఎంత గట్టిదో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా, వీరి స్నేహం ఎప్పటికీ మారలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆనంద్ సాయి టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి పాల్గొనడం పరిపాటిగా మారింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరా నందన్, ఆనంద్ సాయి లతో కలిసి కేరళ, తమిళనాడు లోని పలు దేవాలయాలను సందర్శించారు. ఈ పుణ్యక్షేత్ర యాత్రలో తీసుకున్న ఫోటోను ఆనంద్ సాయి షేర్ చేస్తూ, “జీవితంలో గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది స్నేహమే. మేమిద్దరం చాలా ఏళ్లుగా ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం ఎదురుచూశాం. చివరికి మూడు దశాబ్దాల తర్వాత అది నెరవేరింది” అని రాసుకొచ్చారు.
ఆనంద్ సాయి పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో, పవన్ కల్యాణ్ భక్తిభావాన్ని గురించి చర్చలు మొదలయ్యాయి. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ భక్తి గుణాన్ని మెచ్చుకుంటూ, ఈ యాత్రను మరో మైలురాయిగా అభివర్ణించారు.
టీటీడీ సభ్యుడిగా ఆనంద్ సాయి కీలక భాద్యతలు నిర్వర్తిస్తుండగా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే వారి ఆధ్యాత్మిక అనుబంధం చూసి, అభిమానులు మరిన్ని భక్తి యాత్రలకు ఎదురుచూస్తున్నారు. స్నేహం, భక్తి రెండూ కలిసినప్పుడు అది మరింత పవిత్రమవుతుంది.