
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన బాపు మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ డార్క్ కామెడీ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహించగా, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ముఖ్యపాత్రల్లో నటించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి వారం మంచి స్పందన అందుకున్నప్పటికీ, భారీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. కథ బలమైనప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది.
థియేటర్లలో విడుదలైన 16 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 7 నుంచి జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాను గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించేలా అత్యంత రియలిస్టిక్‌గా తెరకెక్కించారని రివ్యూస్ చెబుతున్నాయి. ఇది బలగం తరహాలో ఉండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ట్యాగ్‌లైన్ “ఏ ఫాదర్ స్టోరీ”, దీని ద్వారా కుటుంబ సంబంధాలను హృదయాన్ని తాకేలా చూపించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన బ్రహ్మాజీ, ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా, ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ కథా చిత్రాలను, నేచురల్ ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాపు మంచి ఎంటర్టైన్మెంట్ అందించనుంది.