
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో సినీ పరిశ్రమలో సత్తా చాటుతున్నారు. ఇటీవల ఫిబ్రవరి 7న విడుదలైన “తండేల్” సినిమా భారీ విజయాన్ని సాధించి, రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విజయం అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతకు ముందు, ఆయన నిర్మించిన “ఆయ్” కూడా సూపర్ హిట్ కావడం విశేషం. నిర్మాతగా తన మార్క్ చూపించిన బన్నీ వాసు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలని ఉత్సాహంగా ఉన్నారు.
స్వతహాగా మెగాభిమాని అయిన బన్నీ వాసు, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. పవన్ కళ్యాణ్ “జనసేన” పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన వెన్నంటి ఉండటమే కాకుండా, కీలక బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభ నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బన్నీ వాసును “పబ్లిసిటీ & డెకరేషన్ ఇన్‌ఛార్జ్” గా నియమించినట్లు తెలుస్తోంది.
ఈ సంవత్సరం జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న మొదటి ఆవిర్భావ సభ ఇదే. అందుకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల దృష్టి కూడా ఈ సభపై ఉంది. ఈ నేపథ్యంలో జనసేన నిర్వహణ బాధ్యతలను బన్నీ వాసు భుజాన వేసుకోవడం విశేషం. తన నైపుణ్యంతో ఈ సభను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, “తండేల్” సినిమా సక్సెస్ మీట్ లో బన్నీ వాసు ఆనందం వ్యక్తం చేశారు. “శ్రీకాకుళం మత్స్యకారుల జీవన విధానం, వారి సంస్కృతిని ప్రతిబింబించే ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది” అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటు మెగా క్యాంప్, అటు అల్లు క్యాంప్ లోనూ బన్నీ వాసు బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ, అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.