
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన “ఛావా”, మహారాష్ట్ర యోధుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఏసు బాయి పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ పాత్రలో అలరించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం, భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా, విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసి, థియేటర్లలో కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్‌కు చేరువ అయిన ఈ చిత్రం, పాన్ ఇండియా స్థాయి సినిమా అయినా కూడా హిందీలో మాత్రమే విడుదల చేయడం పై తెలుగు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తెలుగులో కూడా విడుదల చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు పూర్తి కావొచ్చిన దశలో ఉండగా, సినిమా మార్చి 7న గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజా సమాచారం ప్రకారం, “ఛావా” సినిమాలో విక్కీ కౌశల్ పాత్రకు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. ఈ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది కానీ, ఇది నిజమైతే తెలుగు ప్రేక్షకులకు మరింత ఎగ్జైట్‌మెంట్ కలిగించే వార్త అవుతుంది. ఇక సంగీత విభాగాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ హ్యాండిల్ చేయడం మరో ప్రధాన ఆకర్షణ.
అల్లు అరవింద్ తెలుగు వెర్షన్ రైట్స్ తీసుకోవడంతో, “ఛావా” సినిమాను పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. త్వరలో తెలుగు ట్రైలర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.