నటుడిగా, హాస్యబ్రహ్మగా వెలుగొందుతున్న బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Gautham) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “బ్రహ్మా ఆనందం” (Brahma Anandam). ఇందులో ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఫిబ్రవరి 14 (February 14) న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఫిబ్రవరి 11 (February 11)న ప్రీ-రిజిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై, చిత్రబృందానికి తన ఆశీర్వచనాలు అందజేశారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో చిరంజీవి తన రాజకీయ రీ-ఎంట్రీ (Political Re-entry) గురించి వస్తున్న ఊహాగానాలను తేలికగా కొట్టిపారేశారు.
“నా గురించి కొంతమంది పొరపాటుగా భావిస్తున్నారు. ‘పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు. మళ్లీ రాజకీయాల్లోకి వెళతాడా?’ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. జీవితాంతం నేను కళామతల్లి సేవలోనే ఉంటాను. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయ నాయకులను కలుస్తున్నాను. అంతకుమించి రాజకీయ రంగంలోకి మళ్లీ ప్రవేశించను,” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, తన రాజకీయ లక్ష్యాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొనసాగిస్తారని, తాను పూర్తిగా సినిమాలకే అంకితమవుతానని తేల్చిచెప్పారు. చిరంజీవి ఈ ప్రకటనతో రాజకీయ అభిమానుల్లోనూ, సినీ ప్రియుల్లోనూ కొత్త చర్చకు తెరతీశారు.