
సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన L2: ఎంపురాన్ మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. విడుదలైన తొలి రోజే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ, బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2019లో వచ్చిన ‘లూసీఫర్’ సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా, మోహన్ లాల్ అభిమానులను అలరించడంలో పూర్తిగా విజయం సాధించింది. అయితే, సినిమా ఘన విజయం సాధించినప్పటికీ కొన్ని వివాదాలు దాని చుట్టూ అలుముకున్నాయి.
సినిమాలోని కొన్ని సన్నివేశాలపై మతపరమైన మితవాద సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, చిత్రబృందం సుమారు 24 సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు నటుడు సురేష్ గోపి పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా ఈ మార్పుల్లో భాగంగా తొలగించబడ్డాయి. అంతేకాదు, సినిమా ప్రారంభంలో సురేష్ గోపికి ఇచ్చిన ప్రత్యేక థాంక్స్ కార్డ్‌ను కూడా రిమూవ్ చేశారు. ఈ మార్పుల కారణంగా, సినిమా రన్ టైమ్ 2 నిమిషాలు 8 సెకన్లు తగ్గింది.
ఈ వివాదాల నేపథ్యంలో, చిత్ర నిర్మాతలు సినిమా ప్రమోషన్ ఈవెంట్లను రద్దు చేశారు. దీనిపై స్పందించిన మోహన్ లాల్ క్షమాపణలు తెలియజేశారు. అయితే, చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ఒత్తిడికి లోనై కాకుండా, సమాజంలో శాంతి, సౌహార్ద్రతను కాపాడేందుకే మార్పులు చేసినట్లు తెలిపారు.
L2: ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, Mollywood సినీ పరిశ్రమలో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్ నటించిన ఈ సినిమా, ఆకట్టుకునే కథ, స్టన్నింగ్ విజువల్స్, హై-ఓక్టేన్ యాక్షన్‌తో సినీ ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది.