Mon. Oct 13th, 2025
Deepika Padukone : ‘కల్కి-2’ వివాదంపై పరోక్షంగా స్పందించిన దీపికా పడుకోన్‌

పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా రూపొందుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి-2’ సినిమాల నుంచి దీపికా పడుకోన్‌ తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది. వరుసగా రెండు ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు దీన్ని ప్రొడక్షన్‌ టీమ్‌తో ఉన్న అభిప్రాయ భేదాల కారణంగా అని, మరికొందరు షెడ్యూల్‌ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు దీపిక నేరుగా స్పందించలేదు. కానీ తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

రీసెంట్‌గా ఐఎమ్‌డీబీ సంస్థ ప్రత్యేకంగా విడుదల చేసిన “25 ఏళ్ల భారతీయ సినిమా” నివేదికలో 130 అత్యుత్తమ చిత్రాలు ఎంపికయ్యాయి. అందులో 10 చిత్రాల్లో కథానాయికగా నటించి అరుదైన రికార్డు సాధించిన దీపికా పడుకోన్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీపికా పేరు ఆ జాబితాలో దశాబ్దకాలంగా ఉన్న అగ్రతారలను వెనక్కి నెట్టి ముందువరుసలో నిలవడం విశేషం. ఈ సందర్భంలో ఆమె తన కెరీర్‌పై స్పష్టతను తెలియజేస్తూ.. “నేను ముక్కుసూటిగా ఉంటాను. నమ్మిన విలువలను వదులుకోను. నాకు తప్పనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించడంలో వెనుకాడను. అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటాను కానీ ఎవరికీ తలవంచను” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది.