పరీక్షల సమయం విద్యార్థులకు ఒత్తిడిగా ఉంటుంది. దీన్ని తగ్గించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం ఎంతో సహాయపడుతోంది. ఇటీవల జరిగిన ఎనిమిదవ ఎడిషన్‌లో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పాల్గొని తన అనుభవాలను పంచుకుంది. దీపిక గతంలో డిప్రెషన్‌ను ఎదుర్కొని, దాన్ని విజయవంతంగా అధిగమించిన వ్యక్తి కావడం వల్ల, ఆమె సందేశం ఎంతో ప్రేరణ కలిగించేలా మారింది.
దీపిక చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకుంటూ, “నా స్కూల్ రోజుల్లో లెక్కలంటే చాలా భయం. ఇప్పటికీ నేను బలహీనురాలినే. కానీ భయాన్ని ఎదుర్కోవడం చాలా అవసరం. మోదీ గారి ‘Exam Warriors’ పుస్తకంలో చెప్పినట్టు, సమస్యలను లోపలే దాచుకోవద్దు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీచర్లతో పంచుకోవాలి. అలాగే జర్నల్ లేదా డైరీ రాయడం అలవాటు చేసుకోవడం వల్ల మన భావోద్వేగాలను అర్థం చేసుకోవచ్చు” అని సూచించింది.
తన వ్యక్తిగత జీవితంలో డిప్రెషన్‌ని ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకుంటూ, “ఒక దశలో నేను కూడా మానసిక కుంగుబాటుకు గురయ్యాను. కానీ అంగీకరించడం, సహాయం కోరడం వల్లనే దాన్ని జయించగలిగాను” అని తెలిపింది. విద్యార్థులు తమ సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులతో పంచుకుంటే, ఒత్తిడి తగ్గించుకోవచ్చు అని స్పష్టం చేసింది.
ఈ ఇంటరాక్షన్‌లో దీపిక ప్రధాన మంత్రి మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థుల కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయం అని ప్రశంసించింది. ఫిబ్రవరి 12న విడుదలయ్యే ఫుల్ ఎపిసోడ్‌లో దీపిక మరిన్ని విలువైన సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.