బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి కేసులో కీలక సమాచారం బయటపడింది. దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ అనే వ్యక్తి, ఒక హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైఫ్ ఇంట్లో హౌస్ హెల్పర్ హరి, అప్పుడప్పుడు హౌస్ కీపింగ్ కోసం బయట సంస్థల సహాయం తీసుకునేవాడు. ఈ సమయంలో నిందితుడు షాజాద్ ఒకసారి సైఫ్ ఇంటికి వచ్చాడు. అప్పటినుంచి ఇంటిని దోచుకునే యత్నంతో ప్లాన్ చేయడం ప్రారంభించినట్టు తెలుస్తోంది.
జనవరి 16 రాత్రి, సెక్యూరిటీ గార్డు నిద్రిస్తున్న సమయం చూసుకుని, షాజాద్ భవనం 11వ అంతస్తు వరకు చేరాడు. అటునుంచి డక్ట్ షాఫ్ట్ ద్వారా సైఫ్, కరీనా ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, నిందితుడు మొదట బాత్రూమ్‌లో దాక్కున్నాడు. అనంతరం సైఫ్‌ను అనుకోకుండా ఎదుర్కొని భయంతో ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ గాయపడ్డారు.
మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ గురించి విచారణ చేపట్టిన ముంబై పోలీసులు, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. అయితే అతను బంగ్లాదేశ్ పౌరుడై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దాంతో, అతను భారతదేశంలో ఎలా ప్రవేశించాడో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. అదనంగా, నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నాలుగు పేర్లు చెప్పాడు. గుర్తింపు కార్డు కూడా లేకపోవడంతో అతని అసలు వివరాలు తెలుసుకోవడం పోలీసులు ఎంతో కష్టపడ్డారు.
ఇటీవల, ముంబై పోలీసులు విలేకరుల సమావేశంలో నిందితుడి అసలు పేరు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ అని వెల్లడించారు. నిందితుడి ప్రవర్తన, ఆ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.