Published on Oct 19, 2024 11:16 PM IST
సినీ ఇండస్ట్రీలో పండుగ సీజన్ అంటే రెగ్యులర్ సమయానికంటే కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక ఆ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే దీపావళి సీజన్‌ను కూడా పూర్తిగా వినియోగించుకోవాలని పలువురు చిత్ర దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అంతేగాక, ఈసారి దీపావళికి అదనపు సెలవులు కూడా తోడవుతుండటంతో తమ సినిమాలను రిలీజ్ చేయాలని పలువురు భావిస్తున్నారు.
అయితే, దీపావళి అంటే సినిమా ఇండస్ట్రీలో.. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఓ సెంటిమెంట్ ఎప్పటినుండో ఉంది. దీపావళి పండుగ కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటాం. దీంతో అమావాస్య రోజున ఏదైనా కొత్త పని చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ, ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూనే, ఈసారి మేకర్స్ కొత్త ఆలోచనతో వస్తున్నారు. దీపావళి అమావాస్య రోజున కాకుండా తమ సినిమాను ముందు రోజే ప్రీమియర్ వేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయాలని చూస్తున్నారు.
ఒకవేళ తమ ప్రణాళిక సక్సెస్ అయ్యి.. ప్రీమియర్స్‌లో సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే, ఇక తమ సినిమాకు ఢోకా ఉండదని వారు భావిస్తున్నారు. ఇలా ఈసారి దీపావళికి మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే, వీటిలో ఇప్పటికే రెండు సినిమాలు ప్రీమియర్స్ వేస్తున్నట్లు ప్రకటించాయి. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’తో పాటు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘క’ చిత్రాన్ని అక్టోబర్ 30న ప్రీమియర్స్ వేయనున్నారు. ఇక సత్యదేవ్ నటిస్తున్న ‘జీబ్రా’తో పాటు తమిళ హీరో శివ కార్తికేయన్ ‘అమరన్’, ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీర’ చిత్రాలు అక్టోబర్ 31న రిలీజ్ కానున్నాయి. మరి ఈ దీపావళి అమావాస్య ఏయే చిత్రాల్లో వెలుగులు నింపుతుందో.. ఏయే సినిమాల్లో చీకటి నింపుతుందో వేచి చూడాలి.