
పుష్ప ఫేమ్ జాలిరెడ్డి అలియాస్ డాలీ ధనంజయ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఆయన డాక్టర్ ధన్యత ను ఫిబ్రవరి 16, 2025 న కర్ణాటకలోని మైసూరు లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగగా, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సమాచారం ప్రకారం, 30,000 మందికి పైగా అతిథులు ఈ వివాహ వేడుకకు విచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ సహా పలువురు ప్రముఖులు నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.
ధనంజయ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘‘నా పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా పెళ్లి విజయవంతంగా పూర్తికావడానికి కృషి చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు. మా పెళ్లికి వచ్చినప్పటికీ లోపలికి రాలేకపోయిన వారిని చూసి బాధపడ్డాం. మీరు మాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞులం. మేము మరిన్ని మంచి విషయాలతో త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం’’ అని ధనంజయ పేర్కొన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #DhananjayaWedding హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండగా, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “పుష్ప” టీమ్ సహా మైత్రి మూవీ మేకర్స్ కూడా ధనంజయకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ఈ వివాహ వేడుకలో భారీ భోజన ఏర్పాట్లు, కన్నడ సంప్రదాయ రీతిలో వివాహ పద్ధతులు అందర్నీ ఆకట్టుకున్నాయి. ధనంజయ కొత్త జీవితానికి సినీ వర్గాలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.