
మధ్యప్రదేశ్‌కి చెందిన మోనాలిసా భోజ్, ఉత్తరప్రదేశ్‌లోని మహా కుంభమేళా సందర్భంగా రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించింది. ఆమె ఫోటోలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
ఈ అనూహ్యమైన క్రేజ్ కారణంగా బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాకు తన సినిమాలో చాన్స్ ఇచ్చారు. అయితే, ఇది తాజా వివాదానికి కేంద్రబిందువైంది.
కొంతమంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు సనోజ్ మిశ్రాపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన మోనాలిసా భోజ్ పాపులారిటీని వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ఆమెను సినీ రంగంలోకి బలవంతంగా లాక్కొస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై సనోజ్ మిశ్రా మండిపడ్డారు. ముంబై అంబోలీ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేయించారు. జితేంద్ర నారాయణ్ సింగ్, వాసిమ్ రజ్వీ, రవి సుధా చౌదరి, మహీ ఆనంద్, మారుత్ సింగ్, అభిషేక్ ఉపాధ్యాయ అనే ఐదుగురిపై కేసు నమోదైంది.
“నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మోనాలిసా భోజ్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాను” అని మిశ్రా పేర్కొన్నారు.
ఇక మోనాలిసా భోజ్ తాజాగా కేరళకు ప్రయాణం చేయడం, ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ఈవెంట్ లో హాజరుకావడం మరింత సస్పెన్స్ పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే “మోనాలిసా భోజ్ నిజంగానే సినిమాల్లోకి వస్తుందా? లేక ఎవరి ప్లాన్ లో చిక్కుకుంది?” అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.