- నేడు రాజమండ్రి వేదికగా మెగా ఈవెంట్.
- గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసు బందోబస్తు
- పవన్ కళ్యాణ్ తో సహా పలువురు హాజరు కానున్న నేతలు.
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ రోజుల్లో సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు భారీగా జరుగుతున్న నేపథ్యంలో “గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు కాబోతుండడంతో ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు రాజమండ్రికి చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా, 400 మంది పోలీసు అధికారులతో పాటు, 1200 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు కోసం సమకూర్చారు. కోల్ కత్తా – చెన్నై జాతి రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నారు. అలాగే, ఈవెంట్ జరుగుతున్న గ్రౌండ్ సమీపంలోని వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ ను మళ్లించారు. గోదావరి నాలుగో వంతెన మీదగా భారీ వాహనాలు దివాన్ చెరువు వద్ద జీరో పాయింట్ డైవర్షన్ చేయబడతాయి. గ్రౌండ్ సమీపంలో 20వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఈవెంట్ సందర్భంగా, వేదిక ముందు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, హై మాక్స్ లైట్లు కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, అభిమానులు తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్‌లో సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ ఈవెంట్ ఫీవర్‌లో ఉభయగోదావరి జిల్లాల మెగా అభిమానులు ఎంట్రీ పాసుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, నిర్వాహకులు ఈ వేడుకకు 50,000 నుంచి 70,000 వరకు పాసుల మాత్రమే అందుబాటులో ఉంచారు.