ఏపీ కేబినెట్ మీట్: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్‌లో ప్రస్తావన రానున్నట్లు సమాచారం. అలాగే విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు వాగుపై కూడా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరికొన్ని పథకాలకు శ్రీకారం?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఇసుక పంపిణీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించిన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు మిగతా హామీలను అమలు చేసే దానిపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఏపీలో అమలు చేసేందుకు సిద్దమైన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై అధ్యయనం చేసి.. విధివిధానాలను రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే దసరా లేదా దీపావళి పండుగ వేళ ఈ పథకాన్ని ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందో. కాగా ఈరోజు జరిగే భేటీలో వీటిపై రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రతిపక్షాలు నుంచి ఒత్తిడి…

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోన్ చంద్రబాబు సర్కార్ విఫలమైందంటూ ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలవాలని చెప్పి చంద్రబాబుబ్ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అంటేనే మోసాలను కేర్ ఆఫ్ అడ్రెస్ అని నిప్పులు చెరిగారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించే స్థానంలో ఉన్న చంద్రబాబు ఇంకా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.