
మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఒక్క తెలుగు సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో బాలకృష్ణ భార్యగా, తల్లిగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి తన నటనా ప్రతిభను చాటుకుంది. గ్లామర్ మాత్రమే కాదు, అద్భుతమైన నటనతో కూడా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కానీ ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో కొత్త సినిమాలు సైన్ చేయలేదు.
అయితే, హనీ రోజ్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా ఆమె తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. “రాచెల్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా, హనీ రోజ్ చేసిన తాజా కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజా ఇంటర్వ్యూలో హనీ రోజ్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా ఉన్నా, నా హృదయానికి దగ్గరగా అనిపించే పాత్ర ఇంకా రాలేదు. నా మొదటి సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో మలయాళ ఇండస్ట్రీలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను” అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, “నాకు నటించిన సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొనడం ద్వారానే ఎక్కువ పాపులారిటీ వచ్చింది” అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశంగా మారాయి.
హనీ రోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, రెగ్యులర్‌గా తన ఫొటోలు, అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. త్వరలో విడుదల కానున్న “రాచెల్” సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించనుందా? అనేది ఆసక్తికరంగా మారింది.