ఈ దీపావళీ సందర్భంగా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వస్తున్నా లేటెస్ట్ సినిమాల్లో యువ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన “లక్కీ భాస్కర్” సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమాతో ఈ ఏడాదిలో తన నుంచి మరో రిలీజ్ గా మీనాక్షి చౌదరి వస్తుంది. దీనితో ఈ సినిమా కోసం ఆమె పలు ప్రత్యేక విషయాలు మీడియాతో పంచుకుంది. మరి ఆమె ఎలాంటి విషయాలు పంచుకుందో అనేదే ఈ ఇంటర్వ్యూలో సారాంశం. మరి చూద్దాం తాను ఎలాంటి విషయాలు చెప్పింది అనేది.
లక్కీ భాస్కర్ ప్రయాణం ఎలా సాగింది? సితార సంస్థలో పనిచేయడం ఎలా ఉంది?
గుంటూరు కారం తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా. ఈ మంచి సినిమాలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది. సితార సంస్థ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తుంది. ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి కృతఙ్ఞతలు. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్ చేయడం అనేది మంచి అనుభూతి. నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఇందులో ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బందిపడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.
సినిమాలో మీ రోల్ కోసం ఏమన్నా వర్క్ చేసారా?
డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించాను. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయాను. ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.
కెరీర్ స్టార్టింగ్ లో ఇలాంటి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?
మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిద్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలను ఎంచుకుంటున్నాను.
లక్కీ భాస్కర్ కథ విన్నాక ఏమనిపించింది?
బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్ లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి గారు ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది.
చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ గురించి చెప్పండి?
నేను చూసిన ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ లలో రిత్విక్ ఒకడు. ఎంతో ప్రతిభ ఉంది. డైలాగ్ లు మర్చిపోకుండా చెబుతాడు. ఎక్స్ ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తాడు. అతనికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది.
ట్రైలర్ రిలీజ్ తర్వాత మరిన్ని అంచనాలు పెరిగాయి అప్పుడు ఏమనిపించింది?
ఇది కథా బలమున్న సినిమా. అందుకే సినిమాపై ముందు నుంచి మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాము. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మా నిజమవుతుందని ఆనందం కలిగింది.
మీ హీరో దుల్కర్ సల్మాన్ గురించి చెప్పండి
ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించారు. భాస్కర్ పాత్రకు ఏం కావాలో అది చేసి, కథని భుజాలపై నడిపించారు. అలాగే తెలుగు మాతృభాష కానప్పటికీ, సంభాషణలు నేర్చుకొని చక్కగా చెప్పారు. మమ్మూట్టి గారి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, తనదైన నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతారు దుల్కర్ గారు. భాస్కర్ పాత్రలో కూడా అలాగే ఒదిగిపోయారు.
ఇంతకీ లక్కీ భాస్కర్ ఎలా ఉండబోతుంది?
ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. అందరికీ నచ్చుతుంది.
ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?
మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి గారి సినిమాలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.