ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా జనవరి నెల విషయానికి వస్తే
జనవరి 1 2024 : మలయాళ నటుడు షైన్ టామ్ చాకో వివాహ నిశ్చితార్థం మోడల్ తనూజతో జరిగింది. షైన్ కు గతంలో బబితతో వివాహం జరగగా వారికి ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. ఇక తెలుగులో చాకో ‘దసరా’ సినిమాలో విలన్ గా, ‘దేవర’ చిత్రాల్లో నటించాడు.
జనవరి 3 2024: నటి అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. దర్శకుడు విజయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత అమలాపాల్ 2023 నవంబర్ 5న జగత్ దేశాయ్ ను పెళ్ళాడిన సంగతి తెలిసిందే.
జనవరి 8 2024: సీనియర్ జర్నలిస్ట్, స్వర్గీయ కెఎన్టి శాస్త్రి కుమారుడు జయదేవ్ గుండెపోటుతో కన్నుమూశారు. ‘కోరంగి నుంచి’ అనే చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో ఎన్ఎఫ్డిసి నిర్మించింది. భారతరత్న సిఎన్ఆర్ రావుపై ఫిల్మ్ డివిజన్ కోసం జయదేవ్ ఓ డాక్యుమెంటరీ సైతం రూపొందించారు.
జనవరి 9 2024: ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘జబ్ వియ్ మెట్’, ‘ఇషాక్’, ‘మంతో మౌసమ్’, ‘కాదంబరి’ లాంటి సినిమాల పాటలు పాడిన ప్రముఖ గాయకుడు, పద్మభూషణ్ ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) కోల్ కతాలో అనారోగ్యంతో కన్నుమూశారు.
జనవరి 11 2024: నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ సినిమా వివాదాస్పదమైంది. అందులో కొన్ని సన్నివేశాలు తొలగించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేయడంతో జీ ఎంటర్ టైన్ మెంట్ నెట్ ఫ్లిక్స్ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ ఆపేసి ఆ సన్నివేశాలను తొలగించాక తిరిగి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది.
జనవరి 13 2024: ‘హను-మాన్’ చిత్రానికి నైజాంలో అగ్రిమెంట్ చేసిన విధంగా థియేటర్లు ఇవ్వలేదంటూ ఎగ్జిబిటర్స్ పై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ, నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
జనవరి 22 2024: ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రివైజింగ్ కమిటీ ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను హైకోర్టు రద్దు చేసి సినిమాను మళ్ళీ పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ జారి చేయమని సీబీఎఫ్సిని కోర్టు ఆదేశించింది.
జనవరి 22 2024: నటుడు సుహాస్ మగబిడ్డకి తండ్రి అయ్యాడు.
జనవరి 23 2024: బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీఖాన్ మోచేతికి సర్జరీ అయ్యింది. ‘దేవర’ షూటింగ్ లో ఇబ్బంది కావడంతో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు.
జనవరి 25 2024: మాస్ట్రో ఇళయరాజా కుమార్తె, గాయని, సంగీత దర్శకురాలు భవతారిణి (47) కాన్సర్ తో శ్రీలంకలో కన్నుమూశారు. తెలుగులో ‘అవునా’ చిత్రానికి ఆమె సంగీతం అందించగా తమిళ, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడారు.
జనవరి 25 2024: కేంద్ర ప్రభుత్వం చిరంజీవి, వైజయంతిమాల బాలీని పద్మవిభూషణ్ కు ఎంపిక చేసింది. అలాగే మిథున్ చక్రవర్తి, విజయ్ కాంత్, ఉషా ఉతుప్, ప్యారేలాల్, దత్తాత్రేయ అంబదాస్ లను పద్మభూషణ్ కు ఎంపిక చేసింది.
జనవరి 28 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక గుజరాత్ లో జరిగింది. 2023కి గానూ ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (యానిమల్), ఉత్తమ నటిగా ఆలియా భట్ (రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం గా ‘ట్వెల్త్ ఫెయిల్’, ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా ఎంపికయ్యారు.
జనవరి 29 2024: ‘శ్రీమంతుడు’ కాపీ రైట్స్ కేసులో కొరటాల శివ దోషిగా నిలిచారు.