
టాలీవుడ్ ప్రముఖ గాయని కల్పన ఇటీవల అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకుని అపస్మారక స్థితిలో ఆసుపత్రి చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కల్పనను తీవ్రంగా కలవరపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ మహిళా కమిషన్ను ఆశ్రయించి, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఫిర్యాదు చేశారు.
కల్పన తన ఫిర్యాదులో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని, ఆమె ప్రైవేట్ వీడియోలు కూడా లీక్ చేయడం వల్ల వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా నిర్ధారణ లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేయడం చాలా ప్రమాదకరం అని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, కల్పన తన ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తూ, తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లు తెలిపారు. అదృష్టవశాత్తూ ఆమె భర్త, కుమార్తె సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. కొంతమంది మీడియా ఛానళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం బాధకరమని అన్నారు.
పోలీసులు కూడా ఈ ఘటనను ఆత్మహత్యాయత్నంగా భావించి కల్పన భర్తను విచారించారు, కానీ ఆ తర్వాత నిజం బయటకు వచ్చిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని, నిరాధార ఆరోపణలు చేయకుండా వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని కల్పన కోరారు.