రిషబ్ శెట్టి నటించిన “కాంతారా: చాప్టర్ 1” సినిమాకు సంబంధించిన వివాదాలు ఇంకా ఉత్పన్నమవుతున్నాయి. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకా యాసలూరు మండలం సంతే సమీపంలో “కాంతారా: చాప్టర్ 1” సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం “హోంబాలే ఫిల్మ్స్” అనుమతిని తీసుకుని, గవిబెట్ట పరిసర ప్రాంతాల్లో 23 రోజుల పాటు షూటింగ్ జరిపారు. అయితే, చిత్ర బృందం పేలుడు పదార్థాలను ఉపయోగించడంతో వన్యప్రాణులకు, పర్యావరణానికి హానికిచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ అంశంపై హరీష్ అనే యువకుడు, చిత్రబృందాన్ని ప్రశ్నించగా, సిబ్బంది దాడి చేశారని, ఆ యువకుడు గాయపడినట్లు సమాచారం. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహించారు. “పర్యావరణాన్ని కాపాడాలంటే వెంటనే షూటింగ్ ఆపాలి” అని వారు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర అటవీ, జీవ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర బి. ఖండ్రే కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “షరతులు ఉల్లంఘిస్తే, చర్యలు తీసుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, ఈ సినిమా బృందం హైకోర్టులో ఉన్న కేసులో, భూమి కొనుగోలు చేసిన కెనరా బ్యాంకుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదవడంతో, కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న “కాంతారా: చాప్టర్ 1” సినిమా థియేటర్లలో విడుదల కానుంది.