
ఇటీవల ముంబై ఫిల్మ్ సిటీ సెట్స్‌లో మరోసారి చిరుతపులి కనిపించడం షాక్ కలిగించింది. స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సీరియల్ సెట్లో నిన్న రాత్రి ఈ చిరుతపులి ప్రవేశించిందని సమాచారం. షిఫ్ట్ ముగిసిన తర్వాత ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు మాత్రమే ఉన్న సమయంలో చిరుతపులి వచ్చిందని టీవీ9 హిందీ డిజిటల్ వర్గాలు వెల్లడించాయి.
ఫిల్మ్ సిటీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కు ఆనుకొని ఉండటంతో అక్కడ తరచుగా చిరుతలు, కోతులు, జింకలు, పాములు కనిపించడం సహజమే. సెట్లోని ఆహారం కోసం కోతులు, కుక్కలు చేరడం.. వాటిని వేటాడేందుకు చిరుతలు రావడం జరుగుతుంటుంది.
సాధారణంగా షూటింగ్ సెట్లకు పూర్తి పైకప్పు ఉండదు. ఎక్కువగా ఇనుప రాడ్లతో నిర్మించి, ప్లాస్టిక్, తాటి ఆకులతో కప్పి వుంటారు. ఇవే చిరుతలు సెట్లోకి ప్రవేశించడానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఏవీ ప్రమాదకర ఘటనలు జరగలేదని సమాచారం.
ఈ ఘటనపై ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.