ఇంటర్వ్యూ: నిర్మాత నాగవంశీ – ‘లక్కీ భాస్కర్’ లో ఎలాంటి మెసేజ్ ఉండదు డిఫరెంట్ కమర్షియల్ సినిమా | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సినిమాల పరంగా తమ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి పలు జానర్స్ లో సాలిడ్ హిట్స్ ని తెలుగు ఆడియెన్స్ కి అందించారు. దాదాపు అగ్ర హీరోలు సహా యువ హీరోలతో కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లతో ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా మంచి క్వాలిటీ ప్రాజెక్ట్ లని అందించడంలో ముందుంటున్నారు. అలా తమ నుంచి తెలుగు సహా తమిళ్, మళయాళ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్న నాగ వంశీ నుంచి వస్తున్నా లేటెస్ట్ సినిమానే “లక్కీ భాస్కర్”. మోలీవుడ్ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లతో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రీమియర్ షోస్ రోజునే నాగవంశీ మీడియాతో ముచ్చటించడం జరిగింది. మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

“లక్కీ భాస్కర్” కి భారీ ఎత్తున పైడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు, దీనికోసం చెప్పండి

విడుదలకు ముందే లక్కీ భాస్కర్ పై ఈస్థాయి అంచనాలు ఏర్పడటం సంతోషంగా ఉంది. కొన్ని సినిమాలు మంచి సినిమా చేశామనే సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్’ కలిగించింది. ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాము. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాము. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాము.సినిమాకి టాక్ బాగా వస్తుందన్న నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.

‘సార్’ సినిమా తర్వాత అదే దర్శకుడు వెంకీ అట్లూరితో వెంటనే ఈ సినిమా చేయడానికి కారణం?

జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాము. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాము.

అసలు లక్కీ భాస్కర్ ఎలా ఉండబోతుంది చెప్పండి?

మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.

లక్కీ భాస్కర్ పాత్ర కోసం?

సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.

ఈ సినిమాలో ఏమన్నా మెసేజ్ ఉందా? లేక కమర్షియల్ సినిమానా?

ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.

ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమా విషయంలో బాగా ఎగ్జైట్ అయ్యినట్టు ఉన్నారు..

ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం.

ఇలా మొత్తానికి అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ లక్కీ భాస్కర్ సినిమా చూసి కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ఈ దీపావళికి విడుదలవుతున్న ఇతర సినిమాలు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని నాగవంశీ మీడియాతో ఈ ఇంటరాక్షన్ ముగించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *