- బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్‌లో మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి
- సిటి స్కాన్, ఎక్స్‌రే పరీక్షలు జరిపిన వైద్యులు
- మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయం
- కుడి కాలు కండరం నొప్పితో ఆస్పత్రికి వచ్చిన మంచు మనోజ్.
Manchu Manoj: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఎక్స్ హాస్పిటల్‌లో మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సినీ నటుడు మంచు మనోజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి గాయం కావడంతో సతీమణి మౌనికతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. కుడి కాలు కండరం నొప్పితో మంచు మనోజ్ ఆస్పత్రికి వచ్చారు. సిటీ స్కాన్, ఎక్స్‌రే రిపోర్టులలో నార్మల్ అని తేలింది. రెండు గంటల పాటు మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు సాగాయి. మరికొద్దిసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మంచు మనోజ్ ఇంటికి వెళ్లనున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్
మరోవైపు మంచు కుటుంబంలోని ఆస్తుల వ్యవహారం వివాదానికి దారితీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు తనను, తన భార్యని కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు మంచు మనోజ్. అయితే మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై ఫిర్యాదు చేశాడు మోహన్ బాబు. తండ్రి కొడుకులు ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకున్నారు అనే వార్త టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్కూల్, ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తుండగా.. ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పీఆర్ టీమ్ స్పందించింది. మోహన్ బాబు, మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో అసలు నిజం లేదని తెలిపింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని పీఆర్ టీమ్ పేర్కొంది. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి అని ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంతో ఆస్పత్రికి రావడంతో అటు ఇండస్ట్రీలో, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశమైంది.